జియో​ సంచలనం : నెలకు 1.1 టీబీ ఉచిత డేటా

8 May, 2018 11:10 IST|Sakshi

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన అనంతరం రిలయన్స్‌ జియో, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోనూ తనదైన ముద్ర వేసుకునేందుకు వచ్చేస్తోంది. జియోఫైబర్‌ పేరుతో త్వరలో ఈ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్‌ చేయబోతోంది. ప్రస్తుతం యూజర్లకు ఉచిత డేటాతో ఫైబర్‌-టూ-ది-హోమ్‌ ప్రీవ్యూ ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్రీవ్యూ ప్లాన్‌లలో భాగంగా ఇనిషియల్‌ ప్లాన్‌ కింద 1.1టీబీ వరకు డేటాను యూజర్లకు అందిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ సర్వీసులను ఎంపిక చేసిన నగరాలు అహ్మదాబాద్‌, చెన్నై, జమ్నానగర్‌, ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో జియో టెస్ట్‌ చేస్తోంది. ఈ ఏడాది చివరిలో జియోఫైబర్‌ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్‌ చేయబోతున్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు మంచి ట్రాక్‌లో ఉన్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ గతేడాది జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

100 ఎంబీపీఎస్‌ స్పీడులో నెలకు 100జీబీ ఉచిత డేటాను జియోఫైబర్‌ ఇన్‌షియల్‌ ప్లాన్‌ కింద ఆఫర్‌ చేస్తుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.. ఒక్కసారి ఈ ఎఫ్‌యూపీ అయిపోతే, టాప్‌-అప్‌ల రూపంలో 40జీబీ ఉచిత డేటా అందుబాటులోకి తెస్తుందని, ఇలా నెలలో 25 సార్లు అందించి మొత్తంగా 1.1టీబీ ఉచిత డేటాను ఆఫర్‌ చేస్తుందని తెలిపారు. అయితే ఈ 1.1టీబీ డేటాను 100ఎంబీపీఎస్‌ స్పీడులో అందిస్తుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. గృహ వినియోగదారులకు, వ్యాపార కస్టమర్లకు ఇద్దరికీ ఈ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని, 30 నగరాల్లో 100 మిలియన్‌ టెలివిజన్‌ కస్టమర్లను టార్గెట్‌గా తీసుకుని వీటిని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.  రూ.4500 ఇంటరస్ట్‌ ఫ్రీ సెక్యురిటీ డిపాజిట్‌తో జియోఫైబర్‌ కనెక్షన్‌ తొలుత మార్కెట్‌లోకి వస్తుందని, అనంతరం ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్‌ చేయనుంది. 
 

మరిన్ని వార్తలు