జియోఫోన్‌ ఇక ఆ వెబ్‌సైట్‌లో కూడా...

17 Feb, 2018 08:54 IST|Sakshi
అమెజాన్‌లో కూడా జియోఫోన్‌ (ఫైల్‌ ఫోటో)

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియోఫోన్‌కు, వినియోగదారుల్లో ఫుల్‌ క్రేజీ ఉంది. విడుదల చేసిన ప్రారంభంలోనే ఈ ఫోన్‌కు భారీ మొత్తంలో ఆర్డర్లు కూడా వచ్చాయి. ఆ డిమాండ్‌ తట్టుకోలేక ఒకానొక సమయంలో కంపెనీ బుకింగ్స్‌ను కూడా ఆపివేసింది. ఆ ఫోన్‌ ఇప్పటివరకు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లు, రిలయన్స్‌ జియోవెబ్‌సైట్‌, మైజియో యాప్‌, జియో రిటైల్‌ పార్టనర్‌ స్టోర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇక ఇప్పటి నుంచి ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో కూడా లభ్యమవుతుందట. రిలయన్స్‌ జియో, అమెజాన్‌ ఇండియా శుక్రవారం తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యంలో జియోఫోన్‌ను ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లో కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నాయి. ఈ వారం ప్రారంభంలో మొబిక్విక్‌ ద్వారా కూడా జియోఫోన్‌ బుకింగ్‌లను చేపట్టవచ్చని కంపెనీ చెప్పింది. రూ.1500కు జియోఫోన్‌ను అమెజాన్‌ ఇండియా లిస్ట్‌చేసింది. 

ముందస్తు మాదిరిగానే జియోఫోన్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి, యూజర్లు తమ డివైజ్‌, దాని ఒరిజినల్‌ బాక్స్‌, ఆధార్‌ నెంబర్‌తో పాటు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌ లేదా రిలయన్స్‌ జియో పార్టనర్‌ స్టోర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు దీనిపై ప్రత్యేక లాంచ్‌ ఆఫర్లను కూడా అమెజాన్‌ అందుబాటులో ఉంచుతోంది. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ద్వారా జియో ఫీచర్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, కస్టమర్లకు 50 రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందిస్తామని కంపెనీ చెప్పింది. అదేవిధంగా ఈ ఫోన్‌కు రీఛార్జ్‌ను కూడా అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ద్వారానే చేపడితే, ఫ్లాట్‌ 50 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నారు. 

గతేడాది జూలైలో ఈ ఫోన్‌ను లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ మాదిరి ఇంటర్నెట్‌ డివైజ్‌గా దీన్ని వాడుకునే అవకాశాన్ని రిలయన్స్‌ జియో కల్పించింది. 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈని ఇది ఆఫర్‌ చేస్తోంది. ఈ ఫోన్‌కు 512ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉంది. మెమరీ కార్డు ద్వారా దీన్ని128జీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనుక భాగంలో 2 మెగాపిక్సెళ్ల కెమెరా, ముందు వైపు వీజేఏ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా వల్ల వీడియో కాల్స్‌కు అనుమతి ఉంది. అలాగే అందరూ తరచుగా వాడే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌వంటి వెబ్ బ్రౌజర్లు కూడా ఉన్నాయి. జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్‌, జియోఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ వంటి యాప్స్‌ ప్రీలోడెడ్‌గా వచ్చిన తొలి జియో-బ్రాండెట్‌ ఫోన్‌ ఇందే. జియోటీవీ యాప్ ద్వారా 450 ప్లస్‌ వరకూ లైవ్‌ టీవీ ఛానెళ్లని చూడొచ్చు. అలాగే జియోమ్యూజిక్‌ ద్వారా వివిధ భాషల్లో కోటి పాటల వరకూ యాక్సెస్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్‌తో తెలుగుతో సహా 22 భాషల్లో సహకారం.


 

మరిన్ని వార్తలు