జియోలో కేకేఆర్‌ పెట్టుబడులు : మరో మెగా డీల్‌?

21 May, 2020 16:48 IST|Sakshi

జియో ప్లాట్‌ఫాంలో వాటాల కొనుగోలుకు  కేకేఆర్‌ అండ్‌ కో

ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

త్వరలో  రానున్న అధికారిక ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ:  వరుస పెట్టుబడులతో దూకుడుమీదున్న రిలయన్స్‌ మరో భారీ పెట్టుబడిని సాధించనుంది. రిలయన్స్‌  జియో ప్లాట్‌ఫాంలో అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ అండ్‌  కంపెనీ 5-10 శాతం  వాటాను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన చర్చలను పూర్తి చేసి త్వరలోనే ఈ ఒప్పందాన్ని ప్రకటించనున్నారని తాజా నివేదికల  ద్వారా తెలుస్తోంది. దీని విలువ  ఒక బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  ఛైర్మన్‌  ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో ఏప్రిల్ 22 నుండి, ఫేస్‌బుక్‌తో ప్రారంభించి నాలుగు వ్యూహాత్మక ఆర్థిక పెట్టుబడిదారుల నుంచి మెగా డీల్స్‌ను సాధించింది. తద్వారా గత నాలుగు వారాల్లో దాదాపు 67,000 కోట్ల రూపాయలకుపైగా సేకరించింది.  సోషల్‌   మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ డీల్‌ తరువాత, సిల్వర్ లేక్, విస్టా పార్ట్‌నర్స్ , జనరల్ అట్లాంటిక్‌తో ఒప్పందాలను రిలయన్స్‌ ప్రకటించిన సంగతి  తెలిసిందే. అంతేకాదు  సౌదీ సావరిన్ ఫండ్ పిఐఎఫ్ కూడా జియో ప్లాట్‌ఫాంలలో వాటాను కొనుగోలు చేయనుందనే అంచనాలు  భారీగా ఉన్నాయి. 

జియో ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌కు ముందే జియో ప్లాట్‌ఫాంలో తన వాటాను 75-80 శాతం మేర తగ్గించుకోవాలని  రిలయన్స్‌ యోచిస్తోందని విశ్లేషకుల  అంచనా. మరోవైపు  2021 మార్చి నాటికి  ఆర్‌ఐఎల్‌ను రుణ రహిత సంస్థగా నిలపాలన్నలక్క్ష్య సాధనలో వాటాల విక్రయాలకు దిగ్గజ సంస్థలపై    అంబానీ దృష్టిపెట్టారని భావిస్తున్నారు. (గుడ్‌ న్యూస్‌: జియో అదిరిపోయే ప్లాన్‌)

మరిన్ని వార్తలు