దానిలో జియోనే అగ్రగామి 

23 Mar, 2018 19:23 IST|Sakshi

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌ జియో మరింత ముందుకు దూసుకెళ్తోంది. కొత్త సబ్‌స్క్రైబర్లను యాడ్‌ చేసుకోవడంలో జియో అగ్రగామిగా ఉందని ట్రాయ్‌ డేటాలో వెల్లడైంది. నేడు విడుదల చేసిన ట్రాయ్‌ డేటాలో జనవరి నెలలో భారత్‌ టెలికాం సబ్‌స్క్రైబర్‌ బేస్‌  మొత్తంగా 15.66 మిలయన్లు తగ్గి 1,175.01 మిలియన్లుగా నమోదైనట్టు తెలిసింది. మొత్తంగా వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్లు కూడా 15.5 మిలియన్లు తగ్గి 1,151.94 మిలియన్లుగా నమోదయ్యారు. ఆశ్చర్యకరంగా ఈ నెలలో జియో 8.3 మిలియన్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకున్నట్టు వెల్లడైంది. ఈ సంఖ్య తన ప్రత్యర్థులు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ల చేర్చుకున్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య కంటే రెండింతలు ఎక్కువని తెలిసింది.

2017 డిసెంబర్‌ నెలలో 1,190.67 మిలియన్లుగా ఉన్న టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య, 2018 జనవరి నాటికి 1,175.01 మిలియన్లకు తగ్గినట్టు ట్రాయ్‌ నేడు తెలిపింది. దిగ్గజ టెలికాం ఆపరేటర్లు మొత్తంగా 1.26 కోట్లకు పైగా కస్టమర్లను యాడ్‌ చేసుకున్నట్టు పేర్కొంది. దీనిలో జియో 8.3 మిలియన్‌ కొత్త సబ్‌స్క్రైబర్లతో టాప్‌లో ఉందన్నారు. దీంతో మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్లు 168.3 మిలియన్లకు చేరుకున్నట్టు చెప్పింది. అయితే మొత్తం సబ్‌స్క్రైబర్‌ బేస్‌ పరంగా చూసుకుంటే 291.6 మిలియన్లతో ఎయిర్‌టెల్‌ కంపెనీనే టాప్‌లో ఉంది. కానీ కంపెనీ కేవలం 1.5 మిలియన్‌ మంది కొత్త సబ్‌స్క్రైబర్లను మాత్రమే ఈ కంపెనీ చేర్చుకుంది. అదేవిధంగా ఐడియా 1.1 మిలియన్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను యాడ్‌ చేసుకుంది. వొడాఫోన్‌ 1.28 మిలియన్ల మందిని, బీఎస్‌ఎన్‌ఎల్‌ 0.39 మిలియన్ల మందిని యాడ్‌ చేసుకున్నాయి. ఆర్‌కామ్‌ తన టెలికాం సర్వీసులను డిసెంబర్‌లో మూసివేసిన సంగతి తెలిసిందే.  దీంతో 21 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్‌సెల్‌ కూడా 3.4 మిలియన్ల మందిని, టాటా టెలి 1.9 మిలియన్ల మందిని, టెలినార్‌ 1.6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను వదులుకుంది.    

మరిన్ని వార్తలు