4జీ స్పీడ్‌లో జియో టాప్‌

16 Feb, 2019 00:28 IST|Sakshi

జనవరి గణాంకాల్లో వెల్లడి

న్యూఢిల్లీ: 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతోంది. జనవరిలో కూడా అత్యధిక డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో జియో అగ్రస్థానంలో నిల్చింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జియో 4జీ నెట్‌వర్క్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ సెకనుకు 18.8 మెగాబిట్స్‌ (ఎంబీపీఎస్‌)గా నమోదైంది. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ స్పీడ్‌ 9.5 ఎంబీపీఎస్‌ కాగా, వొడాఫోన్‌ 6.7 ఎంబీపీఎస్, ఐడియా 5.5 ఎంబీపీఎస్‌గా ఉంది.

వొడాఫోన్, ఐడియా తమ మొబైల్‌ వ్యాపారాన్ని విలీనం చేసినప్పటికీ.. అనుసంధాన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున రెండింటి స్పీడ్‌ను వేర్వేరుగా లెక్కించినట్లు ట్రాయ్‌ పేర్కొంది. పోటీ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలు 2జీ, 3జీ, 4జీ సేవలు కూడా అందిస్తుండగా.. జియో మాత్రం 4జీ సర్వీసులు మాత్రమే అందిస్తోంది. మరోవైపు,  4జీ అప్‌లోడ్‌ స్పీడ్‌లో సగటున 5.8 ఎంబీపీఎస్‌ సామర్ధ్యంతో ఐడియా అగ్రస్థానంలో ఉంది. 5.4 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో వొడాఫోన్‌ రెండో స్థానంలో, 4.4 ఎంబీపీఎస్‌తో జియో.. 3.8 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఎయిర్‌టెల్‌ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిల్చాయి.   

Jio tops 4G download speed chart in January, Idea fastest in upload speed: Trai 

మరిన్ని వార్తలు