మరోసారి సత్తా చాటిన జియో

2 Feb, 2018 17:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో మరోసారి తన సత్తాను చాటుకుంది. 4జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. వరుసగా 11వ సారి కూడా  జోరును సాగించిన జియో నవంబర్‌లో నెలలో  మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.  తద్వారా ప్రధాన ప్రత్యర్థులు  ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు  భారీ నిరాశను మిగిల్చింది.

ఆరంభం నుంచి కస్టమర్లకు ఆఫర్లను అందించడంలో దూకుడును ప్రదర్శించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్  డేటాను అందివ్వడంలో   మళ్లీ టాప్‌ లో నిలిచిందనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం సంస్థలు అందించిన  డేటా స్పీడ్‌లో జియో మొదటి స్థానంలో నిలిచింది.  ట్రాయ్‌ డేటా నవంబరు 2017 నాటికి  25.6 ఎంబీపీఎస్  వేగంతో 4జీ సర్వీసు ప్రొవైడర్ల జాబితాలో రిలయన్స్ జియో  మొదటిస్థానంలో నిలిచింది. జియోకు సన్నిహిత ప్రత్యర్థి వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్‌టెల్‌ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్‌  వేగాన్ని అందించాయి. అప్‌లోడ్‌  వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్  నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది.  ఆ తరువాతి స్థానాల్లో ఐడియా(6.6 ఎంబీపీఎస్), జియో( 4.9 ఎంబీపీఎస్)  నిలిచాయి. ఎయిర్టెల్ 4 ఎంబీపీఎస్‌ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది.
 

మరిన్ని వార్తలు