జియో మార్ట్‌ దూకుడు: ఉచిత డెలివరీ 

20 Jul, 2020 20:43 IST|Sakshi

 ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకోసం జియోమార్ట్‌ యాప్‌

 అర‍్డర్లతో నిమిత్తం లేకుండా  ఉచిత డెలివరీ

సాక్షి, ముంబై: రిలయన్స్‌ జియోతో టెలికాం మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సృష్టించేందుకు మరింత దూకుడుగా సిద్ధమవుతోంది. భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ తాజాగా ఆండ్రాయిడ్‌, ఐఫోన్వినియోగదారులకోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా జియోమార్ట్ అన్ని ఆర్డర్‌లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ జూలై15న కంపెనీ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోమార్ట్ ప్రధాన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం లాంచ్‌ చేసిన జియోమార్ట్ యాప్  ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని జియో ప్రకటించింది. రిలయన్స్ తన లాయల్టీ ప్రోగ్రామ్ రిలయన్స్ వన్ లేదా రోన్‌ను జియోమార్ట్‌కు కూడా విస్తరించింది. తద్వారా వినియోగదారులు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్‌లతో పాటు, రోన్ పాయింట్లను సంపాదించవచ్చని తెలిపింది. ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ దూసుకుపోతోంది. ఇప్పటికే 10వేలకు పైగా డౌన్‌లోడ్‌లను సంపాదించింది. జియోమార్ట్ వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే రోజుకు 2,50,000 ఆర్డర్లు వస్తున్నట్టు జియో వెల్లడించింది. అయితే కొన్ని సమస్యలున్నాయంటూ  కొంతమంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు.   

జియోమార్ట్ ఇంతకుముందు750 రూపాయలు అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లకు మాత్రమే ఉచిత డెలివరీని అందిస్తున్న సంగతి గమనార్హం. అమెజాన్ ప్రస్తుతం ఆర్డర్‌లకు 799 రూపాయలపైన ఉచిత డెలివరీని అందిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇవ్వడానికి కనీస ఆర్డర్ విలువ 600 రూపాయలు. ఉచిత డెలివరీ కావాలంటే 1,200 రూపాయలు విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్రోఫర్స్ 800 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లకు ఉచిత డెలివరీని అందిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, జియోమార్ట్‌లో ప్రతి మొదటి ఆర్డర్‌తో కోవిడ్‌-19 ఎసెన్షియల్ కిట్‌ను అందిస్తామని ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు