జియోఫోన్‌ ఆ రెండింటికి ప్రతీక

28 Sep, 2017 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ జియో లాంచ్‌ చేసిన ఫీచర్‌ ఫోన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. కొత్తగా లాంచైన ఈ జియోఫోన్‌ 50 కోట్లకు పైగా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లను లక్ష్యంగా పెట్టుకుని మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌ మన దేశ సమానత్వానికి, వైవిధ్యానికి ప్రతీకని టాప్‌ జియో ఎగ్జిక్యూటివ్‌ గురువారం పేర్కొన్నారు. ప్రతిఒక్కరికీ ఫోన్‌ స్థాయి, అనేది సమానత్వాన్ని నిర్వచిస్తే.. ఈ ఫోన్‌ సపోర్టు చేసే 22 భాషలు వైవిధ్యాన్ని సూచిస్తున్నాయని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ డివైజస్‌, సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ సునిల్‌ దత్‌ తెలిపారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో నేడు ఆయన పాల్గొన్నారు. జియోఫోన్‌ను తాము ఫీచర్‌ ఫోన్‌గా పిలువడం లేదని, దీన్ని తాము 'ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌' గా పిలుస్తున్నట్టు చెప్పారు.

ఫీచర్‌ ఫోన్‌ కంటే మంచి స్పెషిఫికేషన్లను ఈ ఫోన్‌లో ఎక్కువమందికి అందజేస్తున్నామని దత్‌ తెలిపారు. జూలై 21న లాంచ్‌ చేసిన జియోఫోన్‌, 4జీ, వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈతో మార్కెట్‌లోకి వచ్చింది. రూ.1500 డిపాజిట్‌తో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్‌ చేయనుంది. 2.4 అంగుళాల ఈ డివైజ్‌లో 2ఎంపీ రియర్‌ కెమెరా, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సింగిల్‌ నానో-సిమ్‌ స్లాట్‌, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌లున్నాయి. 

మరిన్ని వార్తలు