పేటీఎం భారీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌, వారికి శుభవార్త!

21 Jul, 2018 12:10 IST|Sakshi
పేటీఎం మాల్‌ ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ : డిజిటల్‌ పేమెంట్‌ దిగ్గజం పేటీఎం ఈ-కామర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం మాల్‌, గ్రాడ్యుయేట్లకు శుభవార్త చెప్పింది. అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పేటీఎం మాల్‌ పేర్కొంది. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో దాదాపు 5000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇది క్యాంపస్‌ ఐకాన్‌ ప్రొగ్రామ్‌లో​ సెకండ్‌ ఎడిషన్‌. ఈ ఎడిషన్‌లో భాగంగా విద్యార్థులకు టెక్నాలజీ, మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. వీటిలో టాప్‌ పర్‌ఫార్మెర్స్‌ జాబితాను అక్టోబర్‌ 10న పేటీఎం మాల్‌ ప్రకటించనుంది. వీరికి లక్ష రూపాయల వరకు నగదు బహుమతితో పాటు, పేటీఎం మాల్‌లో ఫుల్‌-టైమ్‌ ఉద్యోగాన్ని కూడా ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్రొగ్రామ్‌ను తొలుత 2017లో లాంచ్‌ చేశారు.

ఆ సమయంలో 2,200 మంది విద్యార్థులను నియమించుకుంది.‘మా క్యాంపస్‌ ఐకాన్‌ ప్రొగ్రామ్‌ ప్రారంభ ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వందల కొద్ది గ్రాడ్యుయేట్లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఏడాది కూడా మరింత మంది విద్యార్థులను చేరుకోవాలనుకుంటున్నాం. దేశంలోనే ఇది అతిపెద్ద క్యాంపస్‌ ఐకాన్‌’ అని పేటీఎం మాల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌సిన్హా తెలిపారు. ఈ ప్రొగ్రామ్‌తో తర్వాతి తరం యువ ప్రొఫిషినల్స్‌కు మంచి అనుభవం కల్గిస్తుందని, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు, ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదో అపూర్వ అవకాశమని అన్నారు. కస్టమర్ల రోజువారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ఆఫ్‌లైన్‌ మర్చెంట్ల వ్యాపారా వృద్ధిని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు