జుట్టుకి జాబ్‌కి ముడి..!

4 Jul, 2015 01:13 IST|Sakshi
జుట్టుకి జాబ్‌కి ముడి..!

కెరీర్‌కు తగ్గట్టు కేశాలంకరణ, స్పా సేవలు కూడా..
- ఇంటికొచ్చి మరీ సేవలందిస్తున్న నొమాడిక్ స్పాలూన్
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
‘భుజాల వరకూ వేలాడే జులపాల జుట్టు మెయిన్‌టెయిన్ చేయడమంటే నాకెంతో ఇష్టం’ అంటూ ఓ కుర్రాడు ఇషాంత్ శర్మలా ఫీలవ్వొచ్చు!
‘పోనీటెయిల్ వేసుకుంటే నేను రాణిలా ఉంటానంటూ’ ఓ చిన్నది చిరునవ్వులు చిందించొచ్చు!!


..అయితే ఇవన్నీ కాలేజీ రోజుల వరకే సుమా. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల కేశాలంకరణ, ముఖారవిందాన్ని నియంత్రిస్తున్నాయి. చేసే జాబ్‌కి.. డ్యూటీకి తగ్గట్టుగా హెయిర్ స్టయిల్ లేకపోతే ఒప్పుకోవట్లేదు. కాకపోతే ఇక్కడొచ్చిన సమస్యేంటంటే... ఉద్యోగం, ఇతరత్రా బాధ్యతల రీత్యా అందానికి మెరుగులుదిద్దేందుకు తగినంత సమయం లేకపోవటమే. దీన్ని గుర్తించే హైదరాబాద్ అమ్మాయి సీమానంద నొమాడిక్ స్పాలూన్ ప్రారంభించింది. గల్లీకో స్పా ఉన్న నేటి రోజుల్లో నొమాడిక్ ప్రత్యేకత ఏంటంటే ఇంటికొచ్చి మరీ స్పా సేవలందించటమే. అది కూడా ఆర్గానిక్ ఉత్పత్తులతో. క్యాండిల్ థెరపీ వంటి వాటితో!! మరిన్ని విశేషాలు సీమానంద మాటల్లోనే..
 
మాది హైదరాబాద్‌లో స్థిరపడిన పంజాబీ కుటుంబం. అప్పట్లో మా అమ్మ నగరంలో సెలూన్ నిర్వహించేది. ఓవైపు కాలేజీలో చదువుకుంటూనే మరోవైపు సెలూన్ నిర్వహణలో సహాయపడేదాన్ని. చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఓ వ్యాపారితో వివాహమైంది. కొన్నేళ్లకు అమ్మ కూడా చనిపోయింది. దీంతో హైదరాబాద్‌లోని సెలూన్ మూసేశాం. తర్వాత కొన్నాళ్లకు ముంబైలో స్పా మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకొని రూ.8 లక్షల పెట్టుబడితో 2014 ఏప్రిల్‌లో ఢిల్లీలో నొమాడిక్ స్పాలూన్ పేరుతో సేవలను ప్రారంభించా. అయితే ఒకప్పుడు పెళ్లిళ్లు, పార్టీల వంటి ప్రత్యేక సందర్భాల్లోనే అందంగా తయారయ్యేవారు. కానీ, ఇప్పుడు

ఇంట్లో ఉన్నా.. బయటికెళ్లినా.. ఉద్యోగం చేస్తున్నా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. చదువనో, ఉద్యోగమనో చాలా మందికి  సెలూన్‌కు, స్పాలకు వెళ్లేందుకు సమయం దొరకట్లేదు. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకైతే మరీను. మహిళలకే కాదు పురుషులు, పిల్లలకు కూడా ఇంటి వరకూ వెళ్లి స్పా సేవలందిస్తున్నాం.
 
నెలకు వంద మంది కస్టమర్లు: ఇప్పటివరకు నొమాడిక్ స్పాలూన్‌కు 2 వేల మంది కస్టమర్లున్నారు. వీరిలో ఢిల్లీలోని బడా పారిశ్రామికవేత్తలు, పలువురు రాజకీయ, సినీతారాలున్నారు. నెలకు వందకు పైగా కొత్త కస్టమర్లకు సేవలందిస్తున్నాం. హెయిర్, బాడీ మసాజ్, వ్యాక్సిన్, పెడిక్యూర్, మెనిక్యూర్, మేకప్, హెయిర్ స్టయిల్స్ వంటి అన్ని రకాల స్పా సేవలున్నాయి. ధర ఎంచుకున్న సేవలను బట్టి రూ.40 నుంచి 10 వేల వరకూ ఉంటాయి.
 
వృద్ధులు, గర్భిణులకు కూడా: నొమాడిక్ స్పాలూన్ సేవలను అందంగా కనిపించాలనుకునే వారికే కాదు వృద్ధులకు, మంచానికే పరిమితమైన వారికి, గర్భిణిలకు కూడా అందిస్తున్నాం. తలనొప్పి, వెన్నునొప్పి వంటి చిన్న చిన్న మసాజ్‌లు కూడా చేస్తాం.
 
నిధుల సమీకరణ బాటలో..
మెట్టినిల్లు ఢిల్లీలో ఉండటంతో మొదట ఢిల్లీలో సేవలను ప్రారంభించాం. ఆ తర్వాత నోయిడా, గ్రేటర్ నోయిడా, ఉత్తర, దక్షిణ ఢిల్లీ వంటి చోట్లకూ విస్తరించాం. ఈ ఏడాది చివరికల్లా పుుట్టినిల్లయిన హైదరాబాద్‌లో ఆ తర్వాత చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, ముంబైలకు విస్తరిస్తాం. రూ.2-5 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం.
 
భద్రత కూడా ముఖ్యమే..

స్పా నిర్వహణలో భద్రతకు సంబంధించిన సమస్యలెక్కువ. దీనికి తోడు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవటమూ సవాలే. మా సిబ్బందితో పాటు కారు డ్రైవర్ ఎలాగూ ఉంటాడు. వీరికి రక్షణగా మరొకరిని పంపిస్తాం. మా సిబ్బంది బయల్దేరేముందు ఆ విషయాన్ని కస్టమర్లకు ఫోన్ చేసి చెబుతాం. తిరిగొచ్చాక మళ్లీ ఫోన్ చేస్తాం. ఇక సేవల విషయంలో... ఓసారి వాడి పారేసే  వస్తువులనే వినియోగిస్తాం. ఇంట్లో స్పాలూన్ సేవలను ప్రారంభించే ముందు కొవ్వొత్తులు వెలిగించి, ఆహ్లాదకరమైన సంగీతంలో, వెల్‌కం డ్రింక్స్ ఇచ్చి ప్రారంభిస్తాం. ఈ విశేషాలే మాకెంతో గుర్తింపును తెచ్చి పెట్టాయి.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

మరిన్ని వార్తలు