జాన్సన్ & జాన్సన్ కి మరో ఎదురు దెబ్బ

4 May, 2016 09:15 IST|Sakshi
జాన్సన్ & జాన్సన్ కి మరో ఎదురు దెబ్బ

న్యూయార్క్: ప్రముఖ బహుళ జాతి సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. ఈ సంస్థ ఉత్పత్తులు బేబీ టాల్క్ పౌడర్, షవర్ టు షవర్  లను కొద్ది దశాబ్దాల పాటు వాడడం మూలంగా  మహిళలకు అండాశయ క్యాన్సర్  సోకుతోందంటూ వచ్చిన ఆరోపణలో  అమెరికా కోర్టు తీర్పు మరోసారి సంస్థకు భారీ షాకిచ్చింది.  మిస్సౌరీ అండ్ న్యూ జెర్సీ కోర్టు తీర్పు  తరహాలోనే మరో తీర్పు వెలువరించింది. బాధితురాలు గ్లోరియా రిస్తెంసుంద్ కి అనుకూలంగా అమెరికా జ్యూరీ తీర్పునిచ్చింది. సుమారు 365కోట్ల రూపాయల జరిమానా (55 మిలియన్ డాలర్లు)  చెల్లించాలని  సోమవారం అమెరికా  జ్యూరీ ఆదేశించింది. బాధితురాలికి జరిగిన అసలు నష్టానికి గాను 5 మిలియన్ డాలర్లు, శిక్షాత్మక నష్టాలకు గాను 50 మిలియన్ డాలర్లు మొత్తం 55  మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది.

అలబామాకు చెందిన  గ్లోరియా రిస్తెంసుంద్ ఒవేరియన్ క్యాన్సర్ తో  బాధపడుతూ జాన్సన్ అండ్ జాన్సన్ పై  ఫిర్యాదుచేశారు.  బేబీ పౌడర్, షవర్ టు షవర్ లను  దశాబ్దాల తరబడి వాడడం మూలంగా అండాశయ క్యాన్సర్ కు గురయిన్నట్టు ఆమె వాదించారు. ఈ తీర్పు తప్పట్ తమ క్లయింట్ సంతోషం వ్యక్తం చేశారని, హిస్టెరెక్టమీ లాంటి ఎన్నో ఆపరేషన్ల  తర్వాత ప్రస్తుతం ఆమె వ్యాధి కొంచెం ఉపశమించినట్టు ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు.  అమెరికాలో నమోదైన అన్ని కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరారు.
 

అయితే దీనిపై మరోసారి అప్పీలు కు వెడతామని సంస్థ ప్రతినిది కరోల్ గూడ్ రిచ్ తెలిపారు. 30 యేళ్ల  తమ సర్వీసులకు ఈ తీర్పు చెప్ప పెట్టులాంటిదన్నారు. తమ పోరాటం కొనసాగుతుందనీ,  తమ నిజాయితీ నిరూపించుకుంటామన్నారు. క్యాన్సర్  సోకడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయని,  ఆమె  కుటుంబంలో  క్యాన్సర్ హిస్టరీ ఉందని వాదించారు. అటు వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో  కంపెనీ  షేరు భారీ నష్టాల్లో ట్రేడవుతోంది.

 
కాగా  బర్మింగ్ హామ్  కు చెందిన ఫాక్స్ అనే మహిళ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తమ అమ్మకాలను పెంచుకోవడం కోసం టాల్క్ ఆధారిత పౌడర్ లు క్యాన్సర్ కు దారితీయ వచ్చని దశాబ్దాలుగా హెచ్చరించడం లేదని గతంలో అమెరికా కోర్టు భావించింది. ఈ వ్యవహారంలో సంస్థపై ఇప్పటికే అమెరికాలో సుమారు 1200 వరకు  కేసులు  నమోదయ్యాయి. గత విచారణలో ఆ కంపెనీ మోసం, నిర్లక్ష్యం, కుట్ర లకు పాల్పడిన్నట్లు ఆమె కుటుంబ న్యాయవాదులు ఆరోపించారు. వీటిని వాడటం వల్లన కలిగే నష్టాల అవకాశాల గురించి ఆ కంపెనీ కి 1980 ప్రాంతంలోనే తెలుసని, అయినా ప్రజలను, నియంత్రణ సంస్థలను మోసం చేస్తూ వచ్చారని వారు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే ఆమ కుటుంబానికి 72 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని  అమెరికా లోని మిస్సోరి స్టేట్ కోర్టు జ్యూరీ ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు