రికార్డుల హోరు

24 Jan, 2015 04:22 IST|Sakshi
రికార్డుల హోరు

స్టాక్ మార్కెట్లకు ఈసీబీ జోష్
నాలుగో రోజూ కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు
8,800 మార్క్ దాటిన నిఫ్టీ
గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ...
273 పాయింట్ల లాభంతో 29,279కు సెన్సెక్స్
74 పాయింట్ల లాభంతో 8,836 వద్ద నిఫ్టీ ముగింపు

 
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ రికార్డుల మోత మెగించాయి. ఏడు వరుస ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లోనే ముగిశాయి. యూరప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీ అంచనాలను మించడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. విదేశీ నిధుల ప్రవాహం జోరుగా ఉండడం దీనికి తోడు రానున్న బడ్జెట్‌పై పెరిగిపోతున్న ఆశాభావం స్టాక్ మార్కెట్లను ఉరకలెత్తించాయి. శుక్రవారం కూడా సూచీలు కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ కొత్త గరిష్ట స్థాయి 29,408ను, నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయి 8,866 పాయింట్లను తాకాయి. నిఫ్టీ 8,800 మార్క్‌ను తొలిసారిగా దాటింది. అయితే  లాభాల స్వీకరణ కారణంగా లాభం స్థాయి 382 పాయింట్ల నుంచి 243 పాయింట్లకు పడిపోయింది. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగిందని జీయోజిత్ పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూస్ చెప్పారు. చివరకు సెన్సెక్స్  273 పాయింట్ల లాభంతో 29,279 పాయింట్ల, నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 8,836  పాయింట్ల  వద్ద ముగిశాయి.

ఈసీబీ ప్యాకేజీతో  జోరు
 
కష్టాల్లో ఉన్న యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడానికి యూరప్ కేంద్ర బ్యాంక్ ప్రతి నెల 6,000 కోట్ల యూరోల బాండ్లను ఈ ఏడాది మార్చి నుంచి వచ్చే ఏడాది వరకూ కొనుగోలు చేయనున్నది. ఈ సొమ్ముల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక పరిస్థితులు గాడిన పడతాయని అంచనా.  అయితే ఈ నిధులు భారత్ వంటి వర్ధమాన దేశాల్లో స్టాక్ మార్కెట్లకు ప్రవహిస్తాయనే భావనతో ఈ మార్కెట్లన్నీ శుక్రవారం లాభాల బాట పట్టాయి. ఈ ప్యాకేజీ మార్కెట్ అంచనాల కంటే అధికంగా ఉండడంతో భారత్‌తో సహా ఇతర వర్ధమాన మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి.

 8 నెలల్లో ఉత్తమ వారం: ఏడు వరుస ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్లు లాభాల బాటన పరుగులు పెట్టాయి. ఈ ఏడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,932 పాయింట్లు, నిఫ్టీ 558 పాయింట్ల చొప్పున (7%) లాభపడ్డాయి. కాగా ఈ వారమంతా మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. 8 నెలల్లో అత్యుత్తమ లాభాలు ఆర్జించిన వారంగా ఈ వారం నిలిచింది.

టాటా మోటార్స్ కొత్త రికార్డు...

టాటా మోటార్స్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి(రూ.591)ని తాకింది. చివరకు 3.8% లాభపడి రూ.588 వద్ద ముగిసింది. అదాని గ్రూప్ షేర్లు అదాని ఎంటర్‌ప్రైజెస్, అదాని పవర్, అదాని పోర్ట్స్ షేర్లు 5-9 శాతం రేంజ్‌లో పెరిగాయి.  వాహన, టెలికం, విద్యుత్ రంగ షేర్లు ఎగశాయి. టాటా పవర్(సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే) 6%, రిలయన్స్ పవర్ 4%, టొరంట్ పవర్ 3%, భారతీ ఎయిర్‌టెల్ 3.7%, సిప్లా 3.1%, ఎల్ అండ్ టీ 2.5% లాభపడ్డాయి. గెయిల్ ఇండియా 1.8% క్షీణించింది. ఇదే బాటలో భెల్ 1.6 శాతం, ఓఎన్‌జీసీ 1 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో  1,802  నష్టపోగా, 1,140 షేర్లు లాభాల్లో ముగిశాయి.
 బీఎస్‌ఈలో  రూ.4,032 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో నగదు విభాగంలో రూ.21,475 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,50,427 కోట్ల చొప్పున టర్నోవర్ నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.2,020 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.1,300 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ఆసియా, యూరప్ మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.
 
 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
 
 మార్కెట్లు ముందుకే.. : క్రెడిట్ సూసీ
 
న్యూఢిల్లీ: రోజుకో కొత్త రికార్డులతో దూసుకుపోతున్న భారత్ స్టాక్ మార్కెట్లలో బుల్ దూకుడు కొనసాగుతుందని గ్లోబల్ బ్రోకరేజి దిగ్గజాలకు చెందిన విశ్లేషకులు నొక్కిచెప్పారు. గతేడాది 30 శాతం పైగా ఎగబాకిన సెన్సెక్స్.. ఈ ఏడాదీ మంచి లాభాలనే అందిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా దేశంలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, సంస్కరణలతో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం.. రానున్న కాలంలో వడ్డీరేట్లు మరింత దిగొచ్చే అవకాశాలే దీనికి కారణమని పేర్కొన్నారు. సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 33,500కు చేరుతుందని తాజాగా జపాన్ బ్రోకరేజి అగ్రగామి నోమురా తన అంచనాలను పెంచడం తెలిసిందే. ఇప్పుడు మరో దిగ్గజం క్రెడిట్ సూసీ కూడా ఇదే పల్లవి అందుకుంది. భారత్ స్టాక్ మార్కెట్లకు సంబంధించి ‘ఓవర్‌వెయిట్’(భారీగా పెరిగే అవకాశం) అంచనాలకు కట్టుబడిఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. కొత్త ఏడాదిలోని తొలి నెలలో ఇప్పటిదాకా బీఎస్‌ఈ సెన్సెక్స్ 9% మేర ఎగబాకడం గమనార్హం. ఆసియాలో అత్యధిక లాభాలందించిన ఇండెక్స్‌గా కూడా నిలిచింది. వచ్చే ఏడాది మార్చికల్లా సెన్సెక్స్ 36,000కు పెరుగుతుందని యాంబిట్ క్యాపిటల్‌కు చెందిన సౌరభ్ ముఖర్జీ  పేర్కొన్నారు. బొగ్గు, బీమా ఎఫ్‌డీఐ బిల్లులు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందొచ్చన్నారు. వాహన, పారిశ్రామిక, ఫైనాన్షియల్ షేర్లు పెరుగుతాయని, లోహ షేర్లు తగ్గుతాయనేది ఆయన అంచనా.

మరిన్ని వార్తలు