షావోమియే ‘గాడ్‌ఫాదర్‌’

13 Jun, 2019 19:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అతి చౌకైన స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తూ ప్రసిద్ధి చెందిన ‘షావోమి’ అనే చైనా కంపెనీ గురించి తెలియనివారు నేటి యువతరంలో ఉండకపోవచ్చు. నిజంగా ఈ కంపెనీని స్మార్ట్‌ఫోన్ల రంగంలో ‘ది గాడ్‌ ఫాదర్‌’గా అభివర్ణించవచ్చు. అందుకు ఓ అసలైన కారణం కూడా ఉంది. ప్రముఖ చైనా వ్యాపారవేత్త లీ జున్‌ స్వతంత్ర భావాలు కలిగిన చిత్రమైన వ్యక్తి. షావోమి కంపెనీ స్థాపించడానికి ముందు ఆయన కోట్లకొద్ది డాలర్లను కుమ్మరించి ‘కింగ్‌సాఫ్ట్‌’ లాంటి పలు కంపెనీలను స్థాపించారు. జోయో అనే ఈ కామర్స్‌ సంస్థను స్థాపించి దాన్ని అనతి కాలంలోనే దాన్ని అమెజాన్‌ చైనాకు అమ్మేశారు. ఆ తర్వాత ‘వైవై కార్పొరేషన్‌’ పేరిట గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తన వ్యాపారాలన్నింటికీ స్వస్తి చెప్పి హఠాత్తుగా చైనా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు.

ఒకనాడు హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘ది గాడ్‌ ఫాదర్‌’  చిత్రాన్ని చైనా భాషలో రీమేక్‌ చేసి తాను స్వయంగా అందులో గాడ్‌ ఫాదర్‌ పాత్రను పోషించారు. ఆ తర్వాత 2010లో జీ జున్‌ సినిమా ప్రపంచం నుంచి మళ్లీ వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టారు. షావోమి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉపయోగించి ‘ఆపరేటింగ్‌ సిస్టమ్‌’ను అభివృద్ధి చేశారు. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ రంగంలో, ఆపిల్, శ్యామ్‌సంగ్, నోకియా, మైక్రోమాక్స్‌ కంపెనీలు హార్డ్‌వేర్‌ రంగంలో రాణిస్తుండగా.. షావోమి రెండు రంగాల్లో రాణించడం విశేషం. ఒకప్పుడు మెకిన్సేలో పనిచేసిన భారతీయుడు మను జైన్‌ షావోమిలో చేరి భారత్‌లో ఈ ఫోన్ల విక్రయానికి అధిపతిగా నియమితులయ్యారు. ఫ్లిప్‌కార్ట్‌ సహాయంతో ఆన్‌లైన్‌లో షావోమి ఫోన్ల అమ్మకాల్లో పెద్ద విప్లవాన్నే సృష్టించారు. 

మరిన్ని వార్తలు