బ్యాంకుల్లో స్కామ్‌లపై జేపీసీ దర్యాప్తు..!

20 Mar, 2018 01:04 IST|Sakshi

యూఎఫ్‌బీయూ డిమాండ్‌

కోల్‌కతా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) స్కాం సహా వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలన్నింటిపైనా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరపాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) డిమాండ్‌ చేసింది. బ్యాంకులను పర్యవేక్షించడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ విఫలమైనందునే ఈ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటిల్లో చిన్న ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని యూఎఫ్‌బీయూ పశ్చిమ బెంగాల్‌ విభాగం కన్వీనర్‌ సిద్ధార్థ్‌ ఖాన్‌ ఆరోపించారు.

‘ఇటీవలి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను ఇద్దరు వజ్రాభరణ వ్యాపారులు మోసం చేసిన కేసులో సమగ్రమైన జేపీసీ విచారణ జరగాలని డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే 1992లో హర్షద్‌ మెహతా స్కామ్‌ సమయంలో జేపీసీ విచారణ జరిపినట్లుగానే ఇప్పుడు కూడా చేయాలని కోరుతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. అసలు పీఎన్‌బీ జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)ల ఆధారంగా చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడిన స్విఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదముద్ర ఉందా లేదా అన్నదీ ప్రశ్నార్థకమేనని ఖాన్‌ పేర్కొన్నారు.

మరోవైపు, భారీ మొండిబాకీలు, కుంభకోణాలతో పాటు బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై తొమ్మిది ట్రేడ్‌ యూనియన్లు మార్చి 21న పార్లమెంటు ముందు ర్యాలీ నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ తెలిపింది. అటు, బెయిల్‌–ఇన్‌ నిబంధనతో కూడిన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు