భూషణ్‌ స్టీల్‌ కోసం టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ పోటీ

15 Aug, 2018 01:04 IST|Sakshi

రెండో విడత బిడ్లు దాఖలు

న్యూఢిల్లీ: రుణాల ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలను ఎదుర్కొంటున్న భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ కొనుగోలు కోసం టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లిబర్టీ హౌస్‌ రెండో విడత బిడ్లు దాఖలు చేశాయి. రుణదాతల కమిటీకి ఇవి తమ బిడ్లను సమర్పించాయి. సవరించిన బిడ్లను దాఖలు చేసేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వారం పాటు గడువును పొడిగిస్తూ ఈ నెల 6న వెసులుబాటు కల్పించింది.

రుణదాతల కమిటీ తాజాగా వచ్చిన బిడ్లను మదింపు చేస్తోందని, ఈ నెల 17న తమ నిర్ణయాన్ని ఎన్‌సీఎల్‌టీకి తెలియజేయనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రుణదాతల కమిటీ లేవనెత్తిన పలు అంశాలను పరిష్కరించినట్టు లిబర్టీ హౌస్‌ ప్రతినిధి తెలిపారు. అయితే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఒక్కటే రూ.19,700 కోట్లకు సవరించిన బిడ్‌ వేసినట్టు తెలుస్తోంది. భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ కోసం టాటా స్టీల్, సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటన్‌కు చెందిన లిబర్టీ హౌస్‌ తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకులకు భూషణ్‌ పవర్‌ రూ.45,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు