ఎయిర్‌బస్‌ ఏ380.. గుడ్‌బై!

15 Feb, 2019 01:15 IST|Sakshi

2021 నుంచి తయారీ నిలిపివేత ∙ కొనేవారు లేనందునే..

టౌలౌజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్‌బస్‌ ఏ380 తయారీ నిలిచిపోనుంది. కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని నిలిపివేస్తున్నట్టు ఎయిర్‌బస్‌ తాజాగా ప్రకటించింది. ప్రధాన కస్టమర్‌ అయిన ఎమిరేట్స్‌ ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. ‘‘ఏ380 తయారీకి సంబంధించి పూర్తి చేయని ఆర్డర్లు పెద్దగా లేవు. కనుక తయారీని కొనసాగించాల్సిన అవసరం కనిపించడం లేదు’’ అని ఎయిర్‌బస్‌ తన ప్రకటనలో తెలిపింది.

500 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌బస్‌ ఏ380ని మార్కెట్లోకి తీసుకొచ్చిన పదేళ్ల తర్వాత సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ నిర్ణయంతో 3,500 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ విమాన తయారీ కారణంగా 2018లో ఎయిర్‌బస్‌కు 463 మిలియన్ల యూరోల నష్టం వచ్చింది. ఇది తమకు బాధాకరమైన నిర్ణయమని ఎయిర్‌బస్‌ సీఈవో టామ్‌ ఎండర్స్‌ అభివర్ణించారు. ఎంతో శ్రమ, ఎన్నో వనరులను వెచ్చించి, కష్టించామని, అదే సమయంలో వాస్తవికంగా వ్యవహరించ కతప్పదని చెప్పారాయన. 2008లో తొలిసారి ఏ380 విమానం ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి వచ్చింది. ఎత్తయిన సీలింగ్, లాంజెస్, డ్యూటీ చెల్లింపుల్లేని షాప్‌లు, బార్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

మరిన్ని వార్తలు