జ్యోతి ల్యాబ్స్‌ 1:1 బోనస్‌  

17 May, 2018 01:20 IST|Sakshi

ఒక్కో షేర్‌కు  50 పైసల డివిడెండ్‌ 

29 శాతం తగ్గిన నికర లాభం  

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో 29 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.107 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.76 కోట్లకు తగ్గిందని జ్యోతి ల్యాబ్స్‌ తెలిపింది. తమ కంపెనీలో విలీనమైన హెంకెల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నష్టాల రద్దుకు సంబంధించి పన్ను రివర్సల్‌  కారణంగా నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.468 కోట్ల నుంచి రూ.558 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

మొత్తం వ్యయాలు రూ.424 కోట్ల నుంచి రూ.451 కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ లాభం 46 శాతం పెరిగి రూ.88 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభ మార్జిన్‌ 3.5 శాతం వృద్ధితో 17.1 శాతానికి ఎగసిందని తెలిపింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు 50 పైసల డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. అంతే కాకుండా ఒక ఈక్విటీ షేర్‌కు మరో ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా(1:1) ఇవ్వనున్నామని తెలిపింది.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.204 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం తగ్గి రూ.179 కోట్లకు చేరిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,760 కోట్ల నుంచి రూ.1,813 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.392 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు