కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు

12 Jul, 2019 11:59 IST|Sakshi
(పిని యంగ్‌మన్‌ నుంచి ఆర్డరు పత్రాలను స్వీకరిస్తున్న బాబా కళ్యాణి)

రఫేల్‌ నుంచి రూ.685 కోట్ల ఆర్డరు

తెలంగాణలో మరో ప్లాంటు  

కళ్యాణి గ్రూప్‌ చైర్మన్‌ బాబా కళ్యాణి వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కళ్యాణి రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ నుంచి సుమారు రూ.685 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. ఇందులో భాగంగా బరాక్‌–8 మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ కోసం 1,000 కిట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని రఫేల్‌.. బీడీఎల్‌కు అప్పగిస్తుంది. బీడీఎల్‌లో తుదిమెరుగులు దిద్దుకుని ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చేరతాయి. గురువారమిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రఫేల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పిని యంగ్‌మన్‌ చేతుల మీదుగా కళ్యాణి గ్రూప్‌ చైర్మన్‌ బాబా కళ్యాణి ఈ మేరకు ఆర్డరు పత్రాలను అందుకున్నారు. రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, కళ్యాణి గ్రూప్‌ సంయుక్తంగా కళ్యాణి రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ వద్ద ఈ కంపెనీకి తయారీ కేంద్రం ఉంది. 2017 ఆగస్టులో ఈ ప్లాంటు ప్రారంభమైంది.

మరో తయారీ కేంద్రం..
హైదరాబాద్‌ సమీపంలో మరో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు బాబా కళ్యాణి వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఎంత పెట్టుబడి, ఏ సమయంలోగా పూర్తి అవుతుందో ఇప్పుడే చెప్పలేనని వివరించారు. అయితే 100 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. భారత్‌తోపాటు పొరుగు దేశాలకు ఇక్కడి నుంచి ఉత్పత్తులను సరఫరా చేస్తామన్నారు. దేశీయంగా తయారీకి అవసరమైన టెక్నాలజీని రఫేల్‌ సమకూరుస్తోందని చెప్పారు. ప్రైవేటు రంగంలో కళ్యాణి రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భారత్‌లో తొలి మిస్సైల్‌ తయారీ కేంద్రమని పిని యంగ్‌మన్‌ గుర్తు చేశారు. ఇక్కడి కేంద్రంలో ఇంటర్‌సెప్టార్స్, మిస్సైల్స్, డిఫెన్స్‌ సిస్టమ్స్‌ తయారు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రూ.3,400 కోట్ల విలువైన స్పైక్‌ యాంటీ ట్యాంక్‌ మిసైల్స్‌ను రఫేల్‌ నుంచి కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ డీల్‌ రద్దు అయినట్టు వస్తున్న వార్తల్లో నిజమెంత అని పినియంగ్‌మన్‌ను సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి ప్రశ్నించగా.. దీనిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

మరిన్ని వార్తలు