కమోడిటీలకు గడ్డు రోజులు పోయినట్టే!

18 Apr, 2016 01:58 IST|Sakshi
కమోడిటీలకు గడ్డు రోజులు పోయినట్టే!

రానున్న త్రైమాసికాల్లో లాభాలు పెరుగుతాయ్
* ఈ ఏడాదిలో కంపెనీలకు మరో 0.75% వడ్డీ భారం తగ్గుతుంది
* కమోడిటీ, సిమెంట్, ఫార్మా, ఇన్‌ఫ్రా బుల్లిష్
* బ్యాంకింగ్, ఆయిల్ మాత్రం తగ్గే అవకాశం

కంపెనీల ఆర్థిక ఫలితాల సమయం మొదలయింది. గత కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న ప్రభావం ఈ త్రైమాసిక ఫలితాల నుంచి ప్రతిబింబించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందనడానికి అనేక సంకేతాలు వెలువడుతున్నాయి.

ప్రపంచలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేస్తుండటం, ఆర్థిక లోటు అదుపులో ఉండటం, ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో కొనసాగుతుండటం... ఇలా అన్ని వైపుల నుంచీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయి. అంతేకాదు!!  కమోడిటీ ధరల పతనం ఆగి స్థిరపడటం కూడా మొదలైంది. ఆయా రంగాలకు చెందిన కంపెనీల ఆదాయాలూ పెరిగే అవకాశాలున్నాయి.
 
వడ్డీ రేట్లు కిందికి దిగుతాయ్: అన్నిటికంటే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వడ్డీరేట్లు దిగొస్తుండటం. జనవరి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5% కంటే కిందకు తగ్గాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమే కూడా. గడచిన ఏడాది కాలంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను 150 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో మరో పావు శాతం తగ్గొచ్చు. ఐతే ఆర్‌బీఐ తగ్గించిన రేట్లను బ్యాంకులు పూర్తిస్థాయిలో అందించలేదు. ఇప్పుడు చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్లను మార్కెట్ రేట్లకు అనుసంధానించటం కాకుండా ఈ మధ్యనే 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

దీంతో బ్యాం కులు డిపాజిట్ల రేట్లను తగ్గించకునే వెసులుబాటు కలిగింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్‌ఆర్ విధానం వల్ల రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది కాలంలో రుణాలపై వడ్డీరేట్లు 0.75% తగ్గవచ్చని అంచనా వేస్తున్నాం. ఈ వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఈ త్రైమాసికం నుంచి కంపెనీల ఫలితాల్లో కనిపిస్తుంది. గతంతో పోలిస్తే నిఫ్టీ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
 
త్రైమాసిక ఫలితాలు... రంగాల వారీగా అంచనాలు!
 స్టీల్ కంపెనీల పనితీరు బాగా మెరుగుపడొచ్చు. ఉక్కు పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు ఈ ఫలితాల్లో కనిపిస్తాయి. అలాగే అమ్మకాలు పెరగడంతో సిమెంట్ కం పెనీల ఆదాయాలూ గణనీయంగా పెరగనున్నాయి. రూపాయి విలు వ తగ్గినా, మార్జిన్ల ఒత్తిడితో ఐటీ కంపెనీల ఆదాయాలు స్థిరంగానే ఉండే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ఆయిల్ కంపెనీల ఆదాయాల్లో క్షీణత కొనసాగుతుంది.

కంపెనీల లాభాలు మొత్తం మీద స్థిరంగా ఉండే అవకాశముంది. ఫార్మా, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల లాభాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఆటో రంగ ఫలితాలు మిశ్రమంగా ఉండొచ్చు. బ్యాంకు షేర్లు మాత్రం ఇంకా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయంగా రిఫైనింగ్ మార్జిన్లు తగ్గడం వల్ల ఇక్కడా ఆ ప్రభావం కనిపిస్తుంది. మొత్తంగా గత త్రైమాసికాల కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

అలా అని కంపెనీల ఆదాయాల్లో ఒకేసారి భారీ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండదు. కానీ కంపెనీల ఆదాయాల క్షీణత ఇక ఆగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం సంస్కరణలను అమలు చేస్తూ, జాతీయ రహదారులు వంటివాటిపై వ్యయాలను చేస్తుంటే రానున్న కాలంలో కంపెనీల ఆదాయాలు క్రమేపీ పెరుగుతాయి.
 - లలిత్ ఠక్కర్, ఎండీ ఏజెంల్ బ్రోకింగ్ (ఇనిస్టిట్యూషన్స్)

మరిన్ని వార్తలు