కార్వీపై 6 నెలల నిషేధం

16 Mar, 2014 01:06 IST|Sakshi
కార్వీపై 6 నెలల నిషేధం

పదేళ్ల కిందట... అంటే 2003-05 మధ్య జరిగిన ఐపీవో (తొలి పబ్లిక్ ఇష్యూ) కుంభకోణానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు వ్యతిరేకంగా సెబీ తీర్పునిచ్చింది. ఆరు నెలల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కంపెనీని నిషేధిం చింది. 

కాని ఈ తీర్పు అమలును నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు సెబీ స్పష్టం చేసింది. దీనిపై న్యాయపరంగా పోరాడనున్నట్లు కార్వీ అధికారులు సాక్షికి వెల్లడించారు. 2003-05 మధ్య దాదాపు 21 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని బ్రోకింగ్ కంపెనీలు నకిలీ పేర్లతో డీమ్యాట్ ఖాతాలను తెరిచి, వాటి ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో ఆయా ఐపీఓలకు దరఖాస్తు చేశాయి. అప్పట్లో చాలా కంపెనీల ఐపీఓలు రిటైల్ విభాగంలో భారీ ఎత్తున ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యేవి. దీంతో వెయ్యి షేర్లకు దరఖాస్తు చేసిన రిటైలర్లకు కొన్ని సందర్భాల్లో 20-30 షేర్లు మాత్రమే దక్కేవి.

లిస్టింగ్‌లోనే మంచి లాభాలొచ్చేవి కూడా. దీనికోసం కొందరు కీలక ఆపరేటర్లు నకిలీ పేర్లతో డీమ్యాట్ ఖాతాలు తెరిచి ద రఖాస్తులు పెట్టడం, షేర్లు అలాట్ కాగానే వాటిని తమ ఖాతాలకు బదిలీ చేసుకోవటం... తరవాత వాటిని మార్కెట్ వెలుపల విక్రయించటం వల్ల అంతిమంగా ఈ ఐపీఓలకు ఫైనాన్స్ చేసినవారికే లబ్ధి చేకూరిందని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది.
 

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్, కార్వీ కంప్యూటర్ షేర్ ప్రైవేట్ లిమిటెడ్, కార్వీ సెక్యూరిటీస్ లిమిటెడ్, కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలున్న కార్వీ గ్రూపు... ఈ వ్యవహారంలో కీలక ఆపరేటర్లకు సహాయపడటం, సహకరించటం, ప్రోత్సహించటం వంటివి చేసినట్లు ఆరోపణలొచ్చాయి.

వీటిపై విచారించిన సెబీ... ఆరు నెలల పాటు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌ను కొత్త పథకాలు ఆరంభించకుండా, కొత్త బాధ్యతలు చేపట్టకుండా, కొత్త ఒప్పందాలపై సంతకాలు పెట్టకుండా నిషేధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. కొత్త కస్టమర్లు, క్లయింట్లను కూడా తీసుకోకూడదు. ఈ తీర్పు కార్వీపై తీవ్ర ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాల అంచనా.

>
మరిన్ని వార్తలు