కశ్మీర్‌కు ఏటా కోటి మంది పర్యాటకులు

29 Dec, 2017 00:38 IST|Sakshi

మౌలిక వసతులకు ఏటా రూ.400 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏటా కోటి మంది పర్యాటకులు తమ రాష్ట్రానికి వస్తున్నట్లు జమ్ము, కశ్మీర్‌ పర్యాటక శాఖ మంత్రి ప్రియ సేథి చెప్పారు. ఆ రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి సర్మద్‌ హఫీజ్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద మౌలిక వసతుల ఏర్పాటుకు పర్యాటక రంగానికి ఏటా రూ.400 కోట్ల కేటాయింపులున్నాయని చెప్పారామె. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య 2 కోట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సందర్శనీయ కేంద్రాలకు జమ్మూకశ్మీర్లో కొదవ లేదని, పర్యాటక కేంద్రాల సందర్శనకు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు హెలికాప్టర్లు సైతం అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. టెర్రరిజం ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. టెర్రరిజం కట్టడికి అన్ని రకాలుగా శ్రమిస్తున్నామని, పర్యాటకులపై జమ్ము, కశ్మీర్‌లో దాడులు జరగలేదని తెలిపారు. కశ్మీర్‌లో తయారైన ఉత్పత్తుల విక్రయానికి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఆర్డ్‌ ఎంపోరియంలు 13 ఉన్నాయని సర్మద్‌ హఫీజ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు