ప్రభుత్వం వైపు బ్యాంకింగ్‌ చూపు..

31 Jan, 2019 02:06 IST|Sakshi

అధిక నిధులపై పీఎస్‌బీల ఆశబ్యాంకు ఖాతాలపై జీఎస్టీ హేతుబద్ధీకరణ

దేశవ్యాప్తంగా ఒకే స్టాంప్‌ డ్యూట80సీ కింద డిపాజిట్‌ కాల వ్యవధి తగ్గించాలి

వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపురూ.30వేలకు...

బడ్జెట్‌ఫై బ్యాంకింగ్‌ ఆకాంక్షలు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంకింగ్‌ రంగం... వచ్చే బడ్జెట్‌పై భారీ ఆశలు కాకపోయినా కనీసం కొన్ని కీలకమైన చర్యలు అయినా ఉంటాయని ఆశిస్తోంది. భారీ ఎన్‌పీఏలు, ఎన్‌పీఏ కేసుల దివాలా పరిష్కార ప్రక్రియల్లో జాప్యం వంటి సమస్యలను ఈ రంగం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇన్‌ఫ్రా, సీŠట్ల్‌ రంగాలకు ప్రభుత్వరంగ బ్యాంకులే (పీఎస్‌బీలు) ఎక్కువ రుణాలు ఇచ్చి ఉండటంతో వీటికి అధిక ఎన్‌పీఏల సమస్య ఉంది. అయితే, రుణాలకు డిమాండ్‌ పెరుగుతుండటం, అదే సమయంలో కొత్తగా మొండి బాకీలుగా మారేవి తగ్గడం కాస్తంత ఊరట.

కనుక గడ్డు పరిస్థితుల నుంచి గట్టేందుకు ప్రభుత్వం నుంచి అధిక మూలధన నిధుల సాయాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఆశిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్‌ సాయం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎస్‌బీలకు రూ.2.11 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఇందులో బ్యాంకులు తమ వంతుగా రూ.58,000 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఇందులో లోటు ఏర్పడితే ప్రభుత్వం అదనపు సాయం చేయనుంది.

తదుపరి ఆర్థిక సాయాన్ని మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటిస్తుందని పీఎస్‌బీలు ఆశిస్తున్నాయి. మొండి బకాయిల సమస్యను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించొచ్చని పలువురు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు కూడా. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఏర్పడిన లిక్విడిటీ పరిస్థితులు ఇంకా పూర్తిగా సర్దుకోకపోవడంతో ఈ దిశగా చర్యలను కూడా ఆశిస్తున్నారు. 

బ్యాంకింగ్‌ రంగం కోర్కెలు ఇవీ.. 

►బ్యాంకు ఖాతాలపై జీఎస్టీని హేతుబబ్ధీకరించాలి. రుణాలు, డాక్యుమెంట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకటే స్టాంప్‌ డ్యూటీని అమలు చేయాలి.
 
►బ్యాంకుల్లో రూ.లక్ష డిపాజిట్‌పై ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉండగా, దీన్ని 5 లక్షలకు పెంచాలి.  

►గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల ఏర్పాటుపై సబ్సిడీలు కల్పించాలి. 

►సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపునిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు ఐదేళ్ల లాకిన్‌ ప్రస్తుతం ఉండగా, ఈ కాల వ్యవధిని తగ్గించాలి. 

►ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 మించితే మూలం వద్దే పన్ను మినహాయించి బ్యాంకులు ఆదాయపన్ను శాఖకు జమ చేస్తున్నాయి. ఈ పరిమితిని రూ.30,000కు పెంచాలి. 

►ఇన్‌ఫ్రా రంగానికి రుణాలిచ్చేందుకు గాను పన్ను రహిత బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు బ్యాంకులకు కూడా అవకాశం కల్పించాలి.
 
►కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్లకు, పీఎస్‌యూలు, ఎన్‌హెచ్‌ఏఐ, డిస్కమ్‌లకు ‘ట్రేడ్‌ రీసీవబుల్స్‌ డిస్కౌంటింగ్‌ సిస్టమ్‌(టీఆర్‌ఈడీఎస్‌)’ను తప్పనిసరి చేయాలి. మూలధన నిధుల కొనసాగింపునకు ఇది అవసరం. ఇది లేకే  ఎన్‌పీఏల సమస్య పెరుగుతోంది.

ఎస్‌ఎంఈల డిమాండ్లు 

►ఎస్‌ఎంఈలకు రుణ లభ్యతను పెంచడంతోపాటు ప్రోత్సాహం అవసరం.  


►భారత్‌మాలా తరహా మరిన్ని ప్రాజెక్టులను రవాణా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. 

►రిటైల్‌ రంగానికి సంబంధించి జాతీయ విధానం తీసుకురావాలి. సంస్కరణలతో వినియోగం పెరుగుతుంది. రిటైల్‌కు పరిశ్రమ హోదా కల్పించాలి. 


►గ్రామీణ రంగానికి, సాగుకు ఎక్కువ నిధుల కేటాయింపులు చేయాలి.  

►భారత్‌ స్టేజ్‌–6 కాలుష్య విడుదల ప్రమాణాలకు మళ్లాల్సి ఉండడంతో ఆటోమొబైల్‌ వాహనాలపై జీఎస్టీ రేట్లు తగ్గించాలి. దీనివల్ల ఆటోమొబైల్‌పై ఆధారపడిన విడిభాగాల పరిశ్రమకూ చేయూత లభిస్తుంది. 

►మెటల్స్, మైనింగ్‌లో దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం ఉండాలి.  


►లాజిస్టిక్స్‌ పార్కులను ఏర్పాటు చేయాలి. 


►పర్యావరణ పరిరక్షణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ కోసం దిగుమతి చేసుకునే క్యాపిటల్‌ గూడ్స్‌పై పన్నును పూర్తిగా ఎత్తివేయాలి.  

►టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ప్రభు త్వం నుంచి విధానపరమైన సహకారం కావాలి. తమ వ్యాపార అస్తిత్వానికి, వృద్ధికి టెక్నాలజీ ఎంతో అవసరమని అధిక శాతం ఎస్‌ఎంఈలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని వార్తలు