వెంచర్ ఫండ్స్కు ప్రోత్సాహం..!

21 Jan, 2016 03:22 IST|Sakshi
వెంచర్ ఫండ్స్కు ప్రోత్సాహం..!

నారాయణ మూర్తి సంఘంకీలక సిఫారసులు
ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ కేపిటల్ ఫండ్స్‌ను ఆకర్షించేలా చర్యలకు సూచనలు
సానుకూల పన్ను విధానాలకు సలహా

న్యూఢిల్లీ: ప్రైవేటు ఈక్విటీ (పీఈఎఫ్) అలాగే వెంచర్ క్యాపిటల్ (వీసీఎఫ్) నిధులకు సంబంధించిన నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని  ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. దేశీయంగా, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి దీర్ఘకాలిక  నిధులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది.

 ముఖ్యంగా ఇందుకు తగిన సానుకూల పన్ను వ్యవస్థ ఉండాలని సూచించింది. కొత్తగా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్రం ప్రతిష్టాత్మక ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమాన్ని నేపథ్యంలో కమిటీ ఈ కీలక సిఫారసులు చేయడం గమనార్హం. సెబీకి సమర్పించిన కమిటీ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు చూస్తే...

  దేశంలో ఫండ్ నిర్వహణా వ్యవస్థలను ప్రోత్సహించాలి. పీఈఎఫ్, వీసీఎఫ్‌కు సంబంధించి ప్రస్తుత ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్ (ఏఐఎఫ్) వ్యవస్థను సంస్కరించాలి.ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు తగిన సెక్యూరిటీ లావాదేవీల పన్నును ప్రవేశపెట్టాలి. తద్వారా ఆదాయాలకు సంబంధించి ఒక పటిష్ట పన్ను విధానాలు అమలు చేయాలి.

  పెట్టుబడులు సుదీర్ఘకాలం సుస్థిరంగా కొనసాగేందుకు  పన్ను ప్రోత్సాహకాలు అవసరం.
విదేశీ ఫండ్స్‌ను ఆకర్షించడంలో తీవ్ర వైఫల్యం నెలకొంటోంది. ఏఐఎఫ్స్‌లో ప్రవాసభారతీయుల పెట్టుబడులకు సంబంధించి నిబంధనలను సరళతరం చేయాలి. ఆయా అంశాల్లో సంక్లిష్టతలు తొలగించాలి. ఈ నివేదికపై ఫిబ్రవరి 10 వరకూ సంబంధిత వర్గాలు సలహాలు, సూచనలు ఇవ్వాలని సెబీ విజ్ఞప్తి చేసింది.

 15 ఏళ్లలో 103 బిలియన్ డాలర్లు...
2001-2015 మధ్య దాదాపు 103 బిలియన్ డాలర్ల విలువైన వెంచర్ కేపిటల్, ప్రైవేటు ఈక్విటీ నిధులు భారత కంపెనీల్లోకి వచ్చాయి. దాదాపు 12 ప్రధాన రంగాల్లోని 3,100కుపైగా సంస్థలు ఈ తరహా నిధులను అందుకున్నాయి.

మరిన్ని వార్తలు