కీబోర్డును మడిచి జేబులో పెట్టుకోవచ్చు!

23 Jun, 2018 11:40 IST|Sakshi

సియోల్‌: దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సరికొత్త కీబోర్డును తయారు చేశారు. మడతపెట్టి జేబులో పెట్టుకునే విధంగా తయారైన ఈ కీబోర్డును ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు అనుసంధానం చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తతం మార్కెట్‌ పలు రకాల కీబోర్డులు ఉన్నాయి. వాటిలో చాపలా చుట్టి వెంట తీసుకెళ్లగలిగేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు సౌత్‌ కొరియాలోని సెజోంగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కీబోర్డును ఎలాగైనా మడతపెట్టవచ్చు. ఈ కీబోర్డు కోసం శాస్త్రవేత్తలు మొదట ఓ సెన్సర్‌ షీట్‌ను తయారు చేశారు. అనంతరం దానిపై సిలికాన్‌ రబ్బర్‌తో చేసిన మరో షీట్‌ను అమర్చారు.

ఈ రెండిటి మధ్య కండక్టివ్ కార్బన్ నానోట్యూబ్స్‌ను అనుసంధానించారు. రబ్బర్ షీట్ పైభాగంలో కీబోర్డ్‌లోని బటన్స్‌ను సూచించేలా గడులు గీశారు. దీంతో ఒక్కో గడి ఒక్కో అక్షరాన్ని సూచిస్తుంది. మనం టైప్ చేసినప్పుడు వేళ్ల ద్వారా కలిగే ఒత్తిడి రబ్బర్‌షీట్ ద్వారా నానోట్యూబ్స్‌పై పడి అడుగున ఉన్న సెన్సర్ షీట్‌కు తగులుతుంది. అప్పుడు సెన్సార్లు ఏ అక్షరాన్ని టైప్ చేశామో గుర్తించి కంప్యూటర్‌కు పంపుతుంది. ఈ కీబోర్డ్ మిగతా కీబోర్డుల్లాగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక కీబోర్డును తయారు చేయడానికి కేవలం ఒక డాలర్‌ మాత్రమే ఖర్చవుతుందన్నారు.

మరిన్ని వార్తలు