కిరణ్‌ షాకు అత్యున్నత పౌర పురస్కారం 

18 Jan, 2020 12:53 IST|Sakshi

బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ఎండీకి అత్యున్నత పౌర పురస్కారం

 ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ - ఆస్ట్రేలియా అవార్డు

సాక్షి, బెంగళూరు: బయోకాన్‌ వ్యవస్థపాపకురాలు,ఎండీ కిరణ్ మజుందార్-షా తన ఖాతాలో అత్యు‍న్నత అవార్డును జమ చేసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ను అందుకున్నారు. ఆస్ట్రేలియా-ఇండియా ద్వైపాక్షిక సంబంధాన్ని అభివృద్ధి చేయడంలో చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా, ముఖ్యంగా వాణిజ్య, విద్యా సంబంధాలను ప్రోత్సహించడంలో ముఖ్యమైన సేవ చేసినందుకు ఆమెకు అత్యున్నత పౌర గౌరవ అవార్డును అందించడం ఆనందంగా ఉందని  ఆస్ట్రేలియా  గవర్నర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అరుదైన ఈ గౌరవం దక్కడం తనకెంతో సంతోషంగా వుందని కిరణ్‌ షా పేర్కొన్నారు. 

శుక్రవారం బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, కాంగ్రెస్ నేత ఆర్‌వి దేశ్‌పాండే, డాక్టర్ దేవి శెట్టి వంట దిగ్గజాల సమక్షంలో కిరణ్‌  షా ఈ అవార్డును అందుకున్నారు. క్యాన్సర్ పరిశోధన, మహిళా సమస్యలపై కిరణ్ షా ప్రదర్శించిన నిబద్ధతతో పాటు, బెంగళూరు నగరాన్నిజీవించగలిగే నగరంగా ఉండేలా చేయడంలో ఆమె కృషి  మనందరికీ తెలుసంటూ ఆస్ట్రేలియా హైకమిషనర్ హరీందర్ సిద్ధూ కిరణ్ షాను ప్రశంసించారు. ప్రపంచంలో విశేషమైన మార్పునకు నాందిపలికిన వ్యక్తులను గుర్తించడం చాలా అద్భుతంగా ఉందన్నారు. కాగా ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ఫిబ్రవరి 14, 1975న ది క్వీన్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో చదివిన కిరణ్ షా ఈ పురస్కారాన్ని స్వీకరించిన భారతీయులోనాల‍్గవ వారు. మదర్ థెరిసా, మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ గౌరవాన్ని అందుకున్నారు. 

మరిన్ని వార్తలు