ఫ్యూచర్ గ్రూప్ చేతికి నీలగిరీస్ స్టోర్లు

22 Nov, 2014 00:51 IST|Sakshi
ఫ్యూచర్ గ్రూప్ చేతికి నీలగిరీస్ స్టోర్లు

 న్యూఢిల్లీ: దక్షిణాదిలో విస్తరించిన నీలగిరీస్ చైన్ స్టోర్లను ఫ్యూచర్ కన్సూమర్ ఎంటర్‌ప్రైజెస్ సొంతం చేసుకుంది. రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్‌నకు ఇది అనుబంధ సంస్థకాగా, ఇందుకు రూ. 300 కోట్లను వెచ్చించనుంది. ఈ విషయాన్ని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా స్టోర్ల నెట్‌వర్క్‌ను విస్తరించే బాటలో నీలగిరీస్‌లో 100% వాటా కొనుగోలు మరో ముందడుగు వంటిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో తక్కువ పెట్టుబడుల పద్ధతిలో ఫ్రాంచైజీల ద్వారా వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలు చిక్కుతుందని తెలిపారు. తయారీలో మరింత నైపుణ్యం, కొత్త బ్రాండ్లు పరిచయం చేసేందుకు అవకాశముంటుందని తెలిపారు.

 దక్షిణాదిపై పట్టు
 నీలగిరీస్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఏడాది కాలంగా ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ భారతంలో విస్తరించిన కంపెనీ దక్షిణాదిలోనూ పట్టుచిక్కించుకునేందుకు నీలగిరీస్ ఉపయోగపడనుంది. ఫ్రాంచైజీ విధానంలో 140 ఔట్‌లెట్లను నీలగిరీస్ నిర్వహిస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాలకు చెందిన పట్టణ ప్రాంతాలలో స్టోర్లను ఏర్పాటు చేసింది. డైరీ, బేకరీ, చాకొలెట్స్ తదితర ఆహార సంబంధ ఉత్పత్తుల బ్రాండ్లను కలిగి ఉంది. బెంగళూరులో తయారీ ప్లాంట్ ఉంది.

మరిన్ని వార్తలు