కిడ్‌జీపై యూరోకిడ్స్‌ కన్ను!

22 Nov, 2019 05:51 IST|Sakshi

సొంతం చేసుకునేందుకు చర్చలు

రూ.1000–1200 కోట్లు ఆఫర్‌

ఇటీవలే యూరోకిడ్స్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్‌

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ విద్యా రంగంలోమరింత బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది. జీలెర్న్‌కు చెందిన కిడ్‌జీ విభాగం పట్ల యూరోకిడ్స్‌ ఆసక్తిగా ఉన్నది. కేకేఆర్‌ భాగస్వామిగా ఉన్న యూరోకిడ్స్‌ ఇందుకు సంబంధించి ప్రాథమిక చర్చలను ప్రారంభించింది. కిడ్‌జీ అన్నది ప్రీస్కూల్స్‌ ప్లాట్‌ఫామ్‌. డీల్‌ విలువ రూ.1,000–1,200 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. డీల్‌ కుదిరితే వచ్చే నిధులతో సుభాష్‌ చంద్ర ఆధ్వర్యంలోని జీ గ్రూపు తన రుణ భారాన్ని మరింత తగ్గించుకునేందుకు వీలు పడుతుంది. రుణాలు చెల్లించేందుకు జీ గ్రూపులో ముఖ్యమైన కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్లు తమ వాటాలను గణనీయంగా తగ్గించుకున్న విషయం తెలిసిందే. కేకేఆర్‌ నాన్‌ బైండింగ్‌ ఆఫర్‌ చేసిందని, దీనిపై జీలెర్న్‌ స్పందించాల్సి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. జీ లెర్న్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లలో లిస్ట్‌ అయిన సంస్థ. కిడ్‌జీని విక్రయించాలంటే ముందుగా జీలెర్న్‌ నుంచి దాన్ని వేరు చేసి, ఆ తర్వాతే ఆ పని చేయాల్సి ఉంటుంది.  

బలమైన బ్రాండ్‌...
జీ గ్రూపునకు దేశవ్యాప్తంగా 750కు పైగా పట్టణాల్లో కిడ్‌జీ బ్రాండ్‌ కింద 1,900 ప్రీ స్కూళ్లు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద ప్రీ స్కూళ్ల చైన్‌ ఇది. 2003లో ఆరంభం కాగా, నాటి నుంచి 9 లక్షల మంది చిన్నారులకు విద్యా సేవలు అందించింది. ప్రస్తుతం కిడ్‌జీ పరిధిలో దేశవ్యాప్తంగా లక్ష మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఇది కాకుండా కే12 స్థాయిలో ‘మౌంట్‌ లిటెరా జీ స్కూళ్ల’ను (ఎంఎల్‌జెడ్‌ఎస్‌) కూడా జీలెర్న్‌ నిర్వహిస్తోంది. స్కూళ్ల ఏర్పాటు, టీచర్లకు శిక్షణ, బోధనా పరికరాలు ఇతర వసతుల కల్పన సేవలను ఇది అందిస్తోంది. ‘‘యూరోకిడ్స్, కిడ్‌జీ కలయిక ఇరువురికీ ప్రయోజనకరం.

మౌంట్‌ లిటెరాను కూడా ఈ చర్చల్లో భాగం చేస్తే మరింత సమయం తీసుకోవచ్చు’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. యూరోకిడ్స్‌ను ఇటీవలే రూ. 1,500 కోట్లకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. స్కూళ్ల నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే ప్రణాళికతో ఉన్న ఈ సంస్థ కిడ్‌జీని సొంతం చేసుకునేందుకు చర్చలు చేపట్టినట్టు తెలుస్తోంది. ‘‘బడా ఇన్వెస్టర్లు జీ లెర్న్‌లో వాటా కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారి ఆఫర్లను సీరియస్‌గానే పరిశీలిస్తున్నాం’’ అంటూ ఇన్వెస్టర్‌ కాల్‌ సందర్భంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో పునీత్‌ గోయంకా ప్రకటించడం గమనార్హం. ప్రాథమిక విద్యకు ముందుగా పిల్లల్లో విద్య పట్ల ఆసక్తిని కలిగించేవే ప్రీ స్కూళ్లు. ఆటలతో పిల్లలను విద్య వైపు ఆకర్షించేలా ఇక్కడ బోధన ఉంటుంది. వీటినే ప్రీ ప్రైమరీ స్కూళ్లు, కిండర్‌గార్డెన్‌ స్కూళ్లు అని కూడా పిలుస్తారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా