జియోలో కేకేఆర్‌ భారీ పెట్టుబడి

22 May, 2020 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ డిజిటల్‌ యూనిట్‌ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతుంది. తాజాగా న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కేకేఆర్‌ జియోలో రూ. 11,367 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో జియోలో 2.32 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఈ మేరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు, ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు చేరనుంది. ఇది కేకేఆర్‌కు ఆసియాలోనే అతి పెద్ద పెట్టుబడి’ అని తెలిపింది

కాగా, గత నెలలో తొలుత ఫేస్‌బుక్‌ జియోలో రూ. 43,574 కోట్లు పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసింది. ఆ తర్వాత సిల్వర్ లేక్, విస్టా పార్ట్‌నర్స్ , జనరల్ అట్లాంటిక్‌ సంస్థలు కూడా జియోలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. తాజాగా కేకేఆర్‌ కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో జియో కొద్ది కాలంలోనే దాదాపు రూ. 78,562 కోట్ల పెట్టుబడులను సేకరించింది. ప్రపంచలోనే ప్రముఖ సంస్థల పెట్టుబడులతో.. ఇండియాలో మరింతగా డిజిటల్‌ సొసైటీని నిర్మించడాని వీలు కలుగుతుందని జియో భావిస్తోంది. ఈ పెట్టుబడులు జియో సాంకేతిక సామర్థ్యాన్ని చాటిచెప్పడంతోపాటుగా, ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో బిజినెస్‌ మోడల్‌ సామర్థ్యాన్ని తెలియజేస్తుందని పేర్కొంది. 

ప్రపంచలోనే అత్యంత గౌరవమైన పెట్టుబడిదారుల్లో ఒకరైన కేకేఆర్‌ను స్వాగతించడం ఆనందంగా ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు.మరోవైపు కేకేఆర్‌ సహా వ్యవస్థాపకుడు హెన్రీ క్రావీస్‌ మాట్లాడుతూ.. కొన్ని కంపెనీలకు దేశంలో డిజిటల్‌ స్థితిగతులను మార్చే సామర్థ్యం ఉంటుంది. ఇండియాలో అదే పనిని జియో ప్లాట్‌ఫామ్స్‌ నిర్వహిస్తుంది. ఈ పెట్టుబడి.. భారత్‌, పసిఫిక్‌ ఆసియాలో ప్రముఖ సాంకేతిక సంస్థలకు మద్దతు ఇవ్వడానికి తాము ఈ సిద్దంగా ఉన్నామని తెలిపేందుకు సూచికగా నిలుస్తుంది’ అని చెప్పారు.(చదవండి : జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి)

మరిన్ని వార్తలు