ఇల్లు.. గొల్లు!

17 Jul, 2020 07:04 IST|Sakshi

దశాబ్ద కనిష్టానికి పడిపోయిన ఇళ్ల అమ్మకాలు నైట్‌ఫ్రాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ: ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య కాలంలో దశాబ్ద కనిష్టానికి పడిపోయాయి. ఈ కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 59,538 మాత్రమేనని ప్రాపర్టీ సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. గతేడాది ఇదే కాలంలోని విక్రయాలతో (1,29,285 యూనిట్లు) పోల్చి చూస్తే 54 శాతం తక్కువ. మార్చి చివర్లో లాక్‌డౌన్‌ విధించడంతో డిమాండ్‌ పతనమైనట్టు ఈ సంస్థ తెలిపింది. ‘‘ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదారులు భారీ కొనుగోళ్లు అయిన ఇళ్ల వంటి వాటికి దూరంగా ఉన్నారు. కార్మికులు, ముడి పదార్థాల కొరత, రుణ లభ్యత సమస్యలు డెవలపర్ల నుంచి నూతన ప్రాజెక్టుల ప్రారంభంపై ప్రభావం చూపించింది’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త రజనిసిన్హా తెలిపారు. ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌: హెచ్‌1 2020’ పేరుతో నివేదికను నైట్‌ఫ్రాంక్‌ సంస్థ గురువారం విడుదల చేసింది.

వివరాలను గమనిస్తే..  
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఎఆర్, అహ్మదాబాద్, కోల్‌కతా పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు 27 శాతం తగ్గి 49,905 యూనిట్లుగా ఉన్నాయి.  
ఏప్రిల్‌–జూన్‌ కాలంలో అమ్మకాలు 84 శాతం పడిపోయాయి. కేవలం 9,632 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ కాలంలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు సున్నాగానే ఉన్నట్టు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది.  
హైదరాబాద్‌లో జనవరి–జూన్‌ మధ్య ఇళ్ల విక్రయాలు 42 శాతం తగ్గి 4,782 యూనిట్లుగానే ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయాలు 8,334 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఈ కాలంలో అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 73% తగ్గాయి. అహ్మదాబాద్‌లో 69 శాతం, చెన్నైలో 67 శాతం, బెంగళూరులో 57%, ముంబైలో 45%, పుణెలో 42 శాతం చొప్పున పడిపోయాయి.  
జనవరి–జూన్‌ కాలంలో నూతన ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభం కూడా 46 శాతం వరకు పడిపోయింది.
ఇళ్ల ధరలను పరిశీలిస్తే మొదటి ఆరు నెలల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణే, చెన్నైలో 5.8% వరకు తగ్గగా.. హైదరాబాద్, బెంగళూరులో 6.9 శాతం, 3.3 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరగడం గమనార్హం.  
అమ్ముడుపోయిన ఇళ్లలో 47 శాతం రూ.50 లక్షల్లోపు ధరల శ్రేణిలోనే ఉన్నాయి.  
కార్యాలయ స్థలాల లీజు జనవరి–జూన్‌లో 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయి 172 లక్షల చదరపు అడుగులకుపరిమితమైంది. 

మరిన్ని వార్తలు