మూడు రోజులు ఆలస్యంగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ సేవలు

23 Aug, 2018 12:34 IST|Sakshi

సాక్షి, కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో నీటమునిగిన కొచ్చి విమాశ్రయం  మూడు రోజులు ఆలస్యంగా తన సేవలను ప్రారంభించనుంది. ముందు ప్రకటించినట్టుగా ఆగస్టు 26నుంచి కాకుండా  29వ తేదీ నుంచి పూర్తి స్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో జరిగిన సమీక్షా సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్ధకు జరిగిన నష్టంపై చర్చించారు. కేరళలోవరద పరిస్థితి  మెరుగవుతున్నప్పటికీ  విమాన సేవలను వాయిదా వేయాల్సిన పరిస్థితి  నెలకొంది. దీంతో తాజా నిర్ణయాన్ని అధికారికంగా  ప్రకటించారు.

కొచ్చి విమానాశ్రయం సోలార్ పవర్ మీద నడుస్తుంది. అధికారులు విమానాశ్రయం నుంచి వరద నీటిని తొలగించినప్పటికీ, విమానాశ్రయం లోపల భారీ వరదలకారణంగా సౌర ఫలకాలు బాగా దెబ్బతిన్నాయి. సుమారు 800 రన్వే లైట్లు మరమ్మతు చేయాలి, 2,600 మీటర్ల పొడవు గోడల పునర్నిర్మించటం అవసరం. దాదాపు 90శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులే వరద బాధితులు, వారందరూ వాళ్ల ఇళ్లలో చిక్కుకుపోయారు. మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం అందించలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి తమ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇతర సదుపాయాలు, కేటరింగ్‌ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్ పోర్టు కేరళ వరదలతో రూ.220 కోట్లు నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేశారు.

కొచ్చి విమానాశ్రయం ప్రపంచంలోనే మొట్టమొదటి సౌరశక్తి విద్యుత్‌ వ్యవస్థకు కలిగిన ఎయిర్ పోర్టు. వరదలతో దీనికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెరియార్‌ నదికి వరదల కారణంగా రన్‌వే, టాక్సీ బే, కస్టమ్స్‌ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్‌  టెర్మినల్స్‌ నీట మునిగాయి. రన్‌వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు నాశనమయ్యాయి.

మరిన్ని వార్తలు