డాక్టర్‌ రెడ్డీస్‌పై కొరియా కంపెనీ దావా

27 Jan, 2017 00:44 IST|Sakshi
డాక్టర్‌ రెడ్డీస్‌పై కొరియా కంపెనీ దావా

తయారీ మార్గదర్శకాల ఉల్లంఘన, మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు
న్యూజెర్సీ స్టేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు
మిలియన్ల డాలర్ల జరిమానా రాబట్టాలని వినతి


హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే బహుళజాతి భారతీయ ఫార్మా కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌కు మరో చిక్కు వచ్చి పడింది. డాక్టర్‌ రెడ్డీస్‌పై దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్‌ కంపెనీ మెజియాన్‌ ఫార్మా కోర్టుకెక్కింది. ఉత్తమ తయారీ విధానం మార్గదర్శకాల (సీజీఎంపీ) విషయంలో పెద్ద ఎత్తున లోపాలను దాచిపెట్టి డాక్టర్‌ రెడ్డీస్‌ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. నిబంధనల అమలులో తప్పుదోవ పట్టించి, మోసపూరితంగా విషయాలను దాచిపెట్టిన డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి మిలియన్‌ డాలర్లను నష్టాల కింద వసూలు చేయాలని కోరింది.

అంగస్తంభన లోపానికి సంబంధించి తమ నూతన ఔషధం ఉడెనాఫిల్‌ దరఖాస్తుకు యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతి నిరాకరించడానికి కారణం డాక్టర్‌ రెడ్డీస్‌ తప్పుదోవ పట్టించడమేనని మెజియాన్‌ ఆరోపించింది. ఉడెనాఫిల్‌ మార్కెటింగ్‌కు అనుమతి నిరాకరించడం వల్ల కాలహరణంతోపాటు వ్యయాలకు దారితీసిందన్నది మెజియాన్‌ ఆరోపణ. దీనివల్ల ఉడెనాఫిల్‌ ఔషధానికి సంబంధించి కొత్తగా తయారీ, సరఫరాదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి మెజియాన్‌ ఎదుర్కొంది. ఉడెనాఫిల్‌ ఎన్‌డీఏ అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేసే చర్యలను ఈ కంపెనీ ఇప్పటికే చేపట్టింది.

మాకు సమాచారం లేదు...
కేసు విషయాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా... మెజియాన్‌ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని, న్యూజెర్సీ స్టేట్‌ కోర్టు నుంచి లీగల్‌ నోటీసు కూడా ఏదీ రాలేదని స్పష్టం చేసింది. తమకు అధికారికంగా ఏదైనా సమాచారం వస్తే అప్పుడు స్పందిస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రతినిధి తెలిపారు. డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన మిర్యాలగూడ, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్లాంట్లలో తనిఖీల సందర్భంగా పలు నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు బయటపడడంతో 2015 నవంబర్‌లో ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటి నుంచి బయటపడకముందే తాజాగా మెజియాన్‌ రూపంలో మరో సమస్యను కంపెనీ ఎదుర్కోనుంది. కాగా, అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్లాంట్లలో ప్రస్తుత త్రైమాసికంలోనే యూఎస్‌ఎఫ్‌డీఏ మరోసారి డిట్‌ నిర్వహిస్తుందని కంపెనీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు