అంతర్జాతీయ ట్రెండ్, ఫలితాలే ఆధారం.. 

21 Jan, 2019 00:58 IST|Sakshi

సోమవారం కోటక్‌ బ్యాంక్,  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఫలితాలు 

ఐటీసీ, మారుతీ సుజుకీ,  ఎల్‌ అండ్‌ టీ ఫలితాలు ఈవారమే 

క్రూడ్, రూపాయిపై దృష్టి.. 

న్యూఢిల్లీ: ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) కార్పొరేట్‌ ఫలితాలు.. దేశీ స్టాక్‌ సూచీలకు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు పర్వాలేదనిపించుకోగా.. ఇండెక్స్‌ హెవీవెయిట్‌ అయిన ఐటీసీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. బుధవారం వెల్లడికానున్న ఈ సంస్థ ఫలితాలు.. శుక్రవారం విడుదలకానున్న ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ ఫలితాలు ఈవారంలో మార్కెట్‌ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయని భావిస్తున్నారు. మరోవైపు గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత విప్రో.. శనివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు వెల్లడికాగా, దీని ప్రభావం సోమవారం మార్కెట్‌ ప్రారంభంపై కనిపించనుంది. క్యూ3 ఫలితాలతో పాటు కంపెనీల యాజమాన్యం చేసే వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.  

ఈవారంలో జోరుగా బ్యాంకింగ్‌ ఫలితాలు.. 
హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. టీవీఎస్‌ మోటార్‌ గణాంకాలు మంగళవారం వెల్లడికానుండగా, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఫలితాలు బుధవారం.. యస్‌ బ్యాంక్, కాల్గేట్‌–పామోలివ్‌ (ఇండియా), అల్ట్రాటెక్‌ సిమెంట్‌ క్యూ3 ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి.  

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు పర్వాలేదు.. 
‘ఆశాజనక ఫలితాలతో చాలా వరకు ఐటీ కంపెనీలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఐటీ సంస్థల క్యూ3.. అంచనాలను అధిగమించాయి. యాజమాన్యాలు చేసిన వ్యాఖ్యలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఈ ఫలితాల సీజన్‌ ఆశాజనకంగా ఉండనుందనే అంశానికి ఇవి సంకేతాలుగా ఉన్నాయి.’ అని ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ విరల్‌ బెరవాలా విశ్లేషించారు.  

అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. 
అమెరికా–చైనాల వాణిజ్య యుద్ధం ముగిసిన సూచనలు ఏవీ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో  ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని ఇప్పటికే వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధం అంశంపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు బ్రిటన్‌ పార్లమెంటులో ప్రధాని థెరెసా మే ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మే స్వల్ప ఆధిక్యంతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. సోమవారం మరో కొత్త బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని సభ ముందు ఉంచుతానని స్పష్టం చేశారు.  

ముడిచమురు ధరల ప్రభావం.. 
ఒపెక్‌ సప్లై కోత నిర్ణయాలతో గతకొంతకాలంగా క్రూడ్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 61 డాలర్లను అధిగమించింది. ఈ ర్యాలీ ఇలానే కొనసాగితే, డాలరుతో రూపాయి మారకం విలువపై ఒత్తిడి కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్‌ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుందని రాయిటర్స్‌ విశ్లేషించింది. ఈ అంశం ఆధారంగానే వడ్డీ రేట్ల కోతపై వచ్చే ఆర్‌బీఐ సమావేశంలో నిర్ణయం తీసుకోనుందని వివరించింది. 

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు.. 
ఈఏడాది జనవరి 1–18 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్‌ నుంచి రూ. 4,040 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. 

మరిన్ని వార్తలు