కోటక్‌ బ్యాంక్‌ లాభం 2,038 కోట్లు

1 May, 2019 00:22 IST|Sakshi

14 శాతం వృద్ధి

ఒక్కో షేర్‌కు 80 పైసలు డివిడెండ్‌ 

స్వల్పంగా పెరిగిన మొండి బకాయిలు 

న్యూఢిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,038 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం( 2017–18) ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,789 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇతర ఆదాయం పెరగడం, తక్కువ కేటాయింపుల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.10,874 కోట్ల నుంచి రూ.13,823 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 80 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కోటక్‌ తెలిపారు.  

నికర వడ్డీ మార్జిన్‌ 4.48 శాతం  
స్డాండ్‌ఎలోన్‌ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం రూ.1,408 కోట్లకు ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో నికర లాభం రూ.1,124 కోట్లు.  నికర వడ్డీ ఆదాయం రూ.2,580 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.3,048 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 2.07 శాతం నుంచి 2.14 శాతానికి, నికర మొండి బకాయిలు 0.71 శాతం నుంచి 0.75 శాతానికి  పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో  స్థూల మొండి బకాయిలు రూ.4,468 కోట్లుగా, నికర మొండి బకాయిలు రూ.1,544 కోట్లుగా ఉన్నాయి.  నికర వడ్డీ మార్జిన్‌ 4.48 శాతంగా నమోదైంది. కేటాయింపులు రూ.171 కోట్లుగా ఉన్నాయి. నిర్వహణ లాభం రూ.2,018 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,282 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.1,270 కోట్లకు పెరిగింది. కేటాయింపులు దాదాపు సగానికి తగ్గాయి. రూ.307 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.171 కోట్లకు తగ్గాయి.  

21 శాతం రుణ వృద్ధి  
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.6,201 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,204 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.38,724 కోట్ల నుంచి రూ.45,903 కోట్లకు పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి 1.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 1.94%కి, నికర మొండి బకాయిలు 0.86% నుంచి 0.70%కి తగ్గాయి. గత ఏడాది మార్చి నాటికి రూ.1,69,718 కోట్లుగా ఉన్న రుణాలు ఈ ఏడాది మార్చి నాటికి 21 శాతం వృద్ధితో రూ.2,05,695 కోట్లకు పెరిగాయి. తొలిసారిగా బ్యాలన్స్‌ షీట్‌ సైజు రూ.3,00,000 కోట్లకు చేరింది. 

ఆ కంపెనీలకు రుణాలివ్వలేదు... 
లిక్విడిటీ సమస్యల కారణంగా రుణ మార్కెట్లో సవాళ్లున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి మించి రుణ వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కోటక్‌ పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌ 4.2–4.5 శాతం రేంజ్‌లో కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా దివాలా తీసిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు గానీ, సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు గానీ, అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలకు గానీ ఎలాంటి రుణాలివ్వలేదని కోటక్‌ స్పష్టం చేశారు. ప్రమోటర్‌ షేర్‌ హోల్డింగ్‌కు సంబంధించిన కేసు తొమ్మిది నెలల తర్వాత విచారణకు రానున్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్‌ 0.65 శాతం లాభంతో రూ.1,379 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఈ షేర్‌ 16 శాతం లాభపడింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా