క్రాఫ్ట్‌ భారీ ఆఫర్‌... యూనిలీవర్‌ నో!

18 Feb, 2017 01:24 IST|Sakshi
క్రాఫ్ట్‌ భారీ ఆఫర్‌... యూనిలీవర్‌ నో!

143 బిలియన్‌ డాలర్లు ఇస్తా్తనన్న క్రాఫ్ట్‌
ఈ విలువ మాకు తగింది కాదు: లీవర్‌


న్యూయార్క్‌: అమెరికాకు చెందిన ఫుడ్, బెవరేజెస్‌ దిగ్గజం క్రాఫ్ట్‌ హీంజ్‌ చేసిన విలీన ప్రతిపాదనను డచ్‌ దిగ్గజ సంస్థ యూనిలీవర్‌ తిరస్కరించింది. విలీనానికి సంబంధించి క్రాఫ్ట్‌ తమను తగిన విధంగా విధంగా విలువ కట్టలేదని పేర్కొంది. తమ గ్రూప్‌ విలువతో పోలిస్తే క్రాఫ్ట్‌ ప్రతిపాదించిన 143 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ చాలా తక్కువని, ఈ డీల్‌ వల్ల షేర్‌హోల్డర్లలకు ఆర్థికంగా గానీ లేదా ఇతరత్రా మరే రూపంలో గానీ లాభం ఏదీ ఉండదని యూనిలీవర్‌ పేర్కొంది. అందుకని దీనిపై తదుపరి చర్చలు జరిగే అవకాశాలేమీ లేవని స్పష్టం చేసింది. అయితే డీల్‌ వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా యూనిలీవర్‌ షేర్లు కొనుగోలు చేశారు.

దీంతో లండన్‌ ఎక్సే్చంజ్‌లో సంస్థ షేర్లు దాదాపు 12 శాతం ఎగిశాయి. ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ విభాగానికి సంబంధించి క్రాఫ్ట్‌ హీంజ్‌ ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద సంస్థ కాగా, ఉత్తర అమెరికాలో మూడో స్థానంలో ఉంది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 6.86 బిలియన్‌ డాలర్ల మేర నమోదయ్యాయి.

క్రాఫ్ట్‌ మార్కెట్‌ వేల్యుయేషన్‌ సుమారు 106 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  మరోవైపు డచ్‌ కంపెనీ అయిన యూనిలీవర్‌ 2016లో సుమారు 56.1 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించింది. డవ్, లిప్టన్, నార్‌ తదితర ప్రముఖమైన బ్రాండ్స్‌ 400 పైగా ఈ కంపెనీకి ఉన్నాయి. లండన్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం భారీగా పెరిగాక యూని లీవర్‌ మార్కెట్‌ విలువ దాదాపు 140 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో క్రాఫ్ట్‌ చేసిన ప్రతిపాదన దాదాపు దీని మార్కెట్‌ విలువకు సమానంగా ఉన్నట్లయింది. అందుకే యూనిలీవర్‌ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రయత్నాలు కొనసాగిస్తాం...: క్రాఫ్ట్‌
యూనిలీవర్‌ తమ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మరింత ఆమోదయోగ్యమైన ఒప్పంద ప్రతిపాదనపై కసరత్తు కొనసాగించనున్నట్లు క్రాఫ్ట్‌ పేర్కొంది. డీల్‌ వార్తలతో అమెరికా మార్కెట్లో క్రాఫ్ట్‌ షేరు ధర ఒక దశలో 7.5 శాతం ఎగిసి 93.81 డాలర్ల వద్ద, యూనిలీవర్‌ 9.5 శాతం పెరిగి 46.62 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయ్యాయి. ఒకవేళ విలీనం సాకారమైతే గుత్తాధిపత్య ధోరణులతో కొనుగోలుదారుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని, భారీ స్థాయిలో ఉద్యోగాల కోత అవకాశాల కారణంగా రాజకీయంగా ప్రకంపనలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు