కేటీఎం టార్గెట్ @50,000 బైక్స్‌

24 Mar, 2017 00:55 IST|Sakshi
కేటీఎం టార్గెట్ @50,000 బైక్స్‌

2018కల్లా 500 షోరూంలు
ప్రోబైకింగ్‌ సౌత్‌ హెడ్‌ గౌరవ్‌ 
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్పోర్ట్స్‌ బైక్‌ బ్రాండ్‌ కేటీఎం ఈ ఏడాది భారత్‌లో 50,000 బైక్‌లను విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. 2016లో కంపెనీ దేశవ్యాప్తంగా 36,000 బైకులు విక్రయించింది. కేటీఎంలో ప్రస్తుతం అయిదు మోడళ్లను రూ.1.4 లక్షల నుంచి రూ.2.3 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉంచామని ప్రోబైకింగ్‌ డివిజన్‌ సౌత్‌ హెడ్‌ గౌరవ్‌ రాథోర్‌ గురువారం తెలిపారు. మార్కెట్‌ తీరుకు అనుగుణంగా మరిన్ని మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. గురువారమిక్కడి కూకట్‌పల్లిలో శ్రీ వినాయక మోబైక్స్‌ ఏర్పాటు చేసిన కేటీఎం షోరూంను ప్రారంభించిన అనంతరం డీలర్‌  కె.వి.బాబుల్‌ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

రూ.8 లక్షలు ఆపైన ధర గల మోడళ్లలో ఉండే ఫీచర్లను కేటీఎం బైక్స్‌లో పొందుపరచడం వల్లే కస్టమర్ల నుంచి ఆదరణ ఉందని తెలియజేశారు. ‘‘భారత్‌లో 350కిపైగా షోరూంలను నిర్వహిస్తున్నాం. 2018 డిసెంబరుకల్లా మరో 150 ఔట్‌లెట్లు తెరుస్తాం’’ అని చెప్పారు. శ్రీ వినాయక మోబైక్స్‌ 9వ కేటీఎం షోరూం బహదూర్‌పురలో మే నాటికి రానుందని బాబుల్‌ రెడ్డి తెలిపారు. నెలకు 110 కేటీఎం బైక్‌లను విక్రయిస్తున్నామని, ఈ ఏడాది నుంచి నెలకు 150 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేవారు. శ్రీ వినాయక బజాజ్‌ ఇప్పటికే 6 బైక్స్‌ షోరూంలను నిర్వహిస్తోంది. జూన్‌కల్లా కొత్తగా రెండు ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని వార్తలు