త్వరలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ బ్యాంక్

20 Jun, 2014 01:23 IST|Sakshi
త్వరలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ బ్యాంక్
  • ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా హైదరాబాద్
  • తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
  • హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధులు సమకూర్చడం ద్వారా కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తామన్నారు. గురువారమిక్కడ గ్యాడ్జెట్ ఎక్స్‌పోను ప్రారంభించిన అనంతరం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
     
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొన్నారు. భాగ్యనగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మహేశ్వరం మండలంలో 600-700 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు రెండు రానున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను సమకూరుస్తోందని వివరించారు.  
     
    డిసెంబర్‌కల్లా 4జీ..: హైదరాబాద్ నగరంలో డిసెంబర్‌కల్లా 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి చెప్పారు. రిలయన్స్‌తోపాటు ఎయిర్‌సెల్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌తో చర్చిస్తున్నామని వెల్లడించారు. వైఫై నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు. కొద్ది వారాల్లో సమగ్ర హార్డ్‌వేర్ పాలసీని ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. దేశంలో భిన్నమైన పాలసీగా రూపొందిస్తామన్నారు. ఐటీ పాలసీకి సైతం మార్పులు చేస్తామని చెప్పారు.
     
    స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు భారత్‌లో అతిపెద్ద ఇంకుబేషన్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు చెప్పారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో డిసెంబర్‌కల్లా ప్రారంభిస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ డిజైన్, తయారీలో నిపుణులను అందించేందుకు ఇంజనీరింగ్ కళాశాలను కంపెనీలు దత్తత తీసుకునే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. గ్యాడ్జెట్ ఎక్స్‌పో స్టీరింగ్ కౌన్సిల్ చైర్మన్ జేఏ చౌదరి మాట్లాడుతూ చిప్ డిజైనింగ్ చేయగలిగే సామర్థ్యం హైదరాబాద్ కంపెనీలకు ఉందని చెప్పారు.  హార్డ్‌వేర్ టెక్నాలజీ అభివృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తోపాటు అభివృద్ధి ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు.
     
    ప్రభుత్వానికి ఏం సంబంధం..: తెలంగాణలో టీవీ9, ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాల నిలిపివేతపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వానికి ఏం సంబంధం. ఈ ఘటనను ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నమిది. ఇది అసమంజసం. చానె ళ్ల ప్రసారాల నిలిపివేత అన్నది స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ తీసుకున్న నిర్ణయమది. వారి నిర్ణయానికి మాకు ఏం సంబంధం. ఎంఎస్‌వోలతో చానెళ్లు చర్చించుకుని పరిష్కారం చేసుకోవాలి’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు