వచ్చే ఏడాదికల్లా ఏపీలో కర్లాన్ ప్లాంటు

14 Jun, 2016 00:56 IST|Sakshi
వచ్చే ఏడాదికల్లా ఏపీలో కర్లాన్ ప్లాంటు

రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి
సోలార్ రంగంలోకి ప్రవేశిస్తున్నాం
సాక్షితో కర్లాన్ సీఎండీ సుధాకర్ పాయ్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరుపుల తయారీ దిగ్గజం కర్లాన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ప్లాంటును నెలకొల్పుతోంది. 2017లో ఈ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. స్థలం తమ చేతుల్లోకి రాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని కర్లాన్ సీఎండీ టి.సుధాకర్ పాయ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అన్నీ అనుకూలిస్తే జనవరిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. స్థలం తమ చేతుల్లోకి రావడమే ఆలస్యమని వివరించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు ఈ యూనిట్ నుంచి పరుపులను సరఫరా చేస్తామని వెల్లడించారు.

 1,000 మందికి పైగా ఉపాధి..
చిత్తూరు ప్లాంటు పూర్తి సామర్థ్యానికి చేరుకునే నాటికి మొత్తం రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి చేయనున్నట్టు సీఎండీ చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనాగా తెలిపారు. ఇటీవలే కంపెనీ ఉత్తరాంచల్‌లోని రూర్కీలో రూ.50 కోట్ల వ్యయంతో ప్లాంటును ఏర్పాటు చేసింది. కంపెనీకి చెందిన 9 ప్లాంట్లు కర్ణాటక, ఒరిస్సాతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. కొద్ది రోజుల్లో మరిన్ని విదేశీ పరుపుల బ్రాండ్లను కర్లాన్ భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. రూ. లక్ష ఆపైన ఖరీదున్న సూపర్ ప్రీమియం పరుపుల వాటా సంస్థ ఆదాయంలో 10 శాతముంది. ఫర్నీచర్‌తోపాటు లినెన్, పిల్లోస్, బ్లాంకెట్స్ వంటి విభాగాల్లోకి కర్లాన్ గతేడాది ప్రవేశించింది.

 కొత్త విభాగాల్లోకి..
సౌర విద్యుత్ రంగంలోకి ప్రవేశించాలని కర్లాన్ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న సోలార్ పాలసీలను అధ్యయనం చేస్తున్నట్టు సుధాకర్ పాయ్ వెల్లడించారు. కాగా, భారత్‌లో పరుపుల మార్కెట్ సుమారు రూ.6,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా రూ.2,000 కోట్లపైమాటే. వ్యవస్థీకృత రంగంలో కర్లాన్‌కు 45 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇక 2020 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. 2018లో ఐపీవోకు వెళ్లాలని కంపెనీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు