లేడీ రోసెట్టాతో.. ఏడాదికి రూ. 25కోట్లు

30 Jan, 2020 19:59 IST|Sakshi

ఆలూ సాగుతో కోట్లు సంపాదిస్తున్న గుజరాత్‌ రైతులు

ఏడాదికి సగటున 20 వేల టన్నుల  బంగాళాదుంప దిగుబడి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని ఒకే కుటుంబానికి చెందిన పది మంది రైతులు బంగాళాదుంపలను పండించి ఏడాదికి 25 కోట్లు సంపాదిస్తున్నారు. లేడీ రొసెట్టా(ఎల్‌ఆర్‌)రకానికి చెందిన ప్రత్యేక బంగాళాదుంపలను సంవత్సరానికి 20,000 మెట్రిక్‌ టన్నులను పండించి లాభాలను అర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తె..అరవల్లి జిల్లా దోల్‌పూర్‌ కంపాకు చెందిన జితేష్‌ పటేల్‌ అనే రైతు బంగాళా దుంపలను పండిస్తూ దేశంలోనే రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత 25 సంవత్సరాలుగా జితేష్‌ కుటుంబం బంగాళాదుంపలను పండిస్తున్నట్లు జితేష్‌ తెలిపారు. గ్లోబల్‌ పొటాటో కాంక్లేవ్‌-2020లో పాల్గొన్న జితేష్‌ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జితేష్‌ మాట్లాడుతూ.. తాను  ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌  కోర్సును అభ్యసించానని అందులో నేర్చుకున్న మెళకువలను ఎల్‌ఆర్‌ పంట పండించడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

తాము 2007లో పది ఎకరాలతో ఎల్‌ఆర్‌ బంగాళాదుంప పంట సేద్యం చేశామని, ప్రస్తుతం వెయ్యి ఎకరాలతో సేద్యం చేస్తున్నామని తెలిపారు. ఎల్‌ఆర్‌ రకానికి చెందిన ప్రత్యేక బంగాళాదుంప తయారీదారులకు విపరీతమైన డిమాండ్‌ ఉందని టెక్నో అగ్రి సైన్సెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సచిన్‌ మాదన్‌ తెలిపారు. గుజరాత్‌ రాష్ట్రం నుంచి లక్ష టన్నులు ఎల్‌ఆర్‌ బంగాళాదుంపలను ఇండోనేషియా, కువైట్‌, ఒమన్, సౌదీ అరేబియా తదితర దేశాలు కొనుగోళ్లు చేశాయని తెలిపారు. తమ కుటుంబానికి పాథాలజీ, మైక్రోబయాలజీ, హార్టికల్చర్‌ తదితర రంగాలలో నైపుణ్యం ఉందని జితేష్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఈ రకమైన బంగాళాదుంపలు చిప్స్‌ , వేఫర్స్‌ తయారీకి ఎంతో ఉపయోగకరమని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జితేష్‌ కుటుంబం పండించిన బంగాళాదుంపలను ప్రముఖ చిప్స్‌ తయారీ కంపెనీలు బాలాజీ, ఐటీసీలు కొనుగోళ్లు చేస్తుండడం విశేషం. 

మరిన్ని వార్తలు