వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ ఎస్‌యూవీ భారత్‌లో లాంచ్‌

11 Jan, 2018 15:14 IST|Sakshi

ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ భారత్‌లో లాంచ్‌ అయింది. ఊరుస్‌ పేరుతో ఈ ఎస్‌యూవీని ఇటాలియన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని విడుదల చేసింది. దీని ధర ఎక్స్‌షోరూం, భారత్‌లో రూ.3 కోట్లగా నిర్ణయించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో ఎస్‌యూవీ కావడం విశేషం. ఎల్‌ఎం002 తర్వాత కంపెనీ ఉత్పత్తి చేసిన ఎస్‌యూవీ ఇదే. కొన్ని నెలల క్రితమే ఈ కారును గ్లోబల్‌గా లంబోర్ఘిని లాంచ్‌ చేసింది. ఈ లాంచింగ్‌తో భారత్‌ పోర్ట్‌ఫోలియోలో ఆవెంటోర్, హురాకాన్ వంటి సూపర్‌కార్ల సరసన ఇది కూడా వచ్చి చేరింది. 3500 వాహనాల వార్షిక ఉత్పత్తితో, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మంచి వాల్యుమ్‌ను ఊరుస్‌ అందిస్తుందని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టెఫానో డొమెనికల్ అన్నారు.  భవిష్యత్తు వృద్ధిలో భారత్‌ కూడా  ఓవ్యూహాత్మకమైన మార్కెట్‌ అని లంబోర్ఘిని ఇండియా అధినేత శరద్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రపంచంలోని తొలి కొన్ని మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని పేర్కొన్నారు.  

ఇది కేవలం ప్రాక్టికల్‌ ఎస్‌యూవీ మాత్రమే కాదని, మెరుగైన ప్రదర్శనను ఇది కనబర్చనున్నట్టు లంబోర్ఘిని చెప్పింది. ఊరుస్‌ 4 లీటర్‌ ట్విన్‌-టర్బో వీ8 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అత్యధికంగా 650 హెచ్‌పీ, 850ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.6 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్‌ను, 12.8 సెకన్లలో 200 కేఎంపీహెచ్‌ను చేరుకోగలదు. ఊరుస్‌ టాప్‌ స్పీడ్‌ 305 కేఎంపీహెచ్‌. దీని వీ8 ఇంజిన్‌ 8 స్పీడ్‌ టర్క్‌ కన్వర్టర్‌తో కలిసి రూపొందింది. ఈ ఇంజిన్ దాని విభాగంలో అత్యంత శక్తివంతమైనది, ఉరూస్‌ని దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీగా చేస్తుందని తెలుస్తోంది. కేవలం ఊరుస్‌ కోసమే స్పెషల్‌ టైర్లను లంబోర్ఘిని అభివృద్ధి చేసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు