భారీగా పెరిగిన పీఈ, వీసీ పెట్టుబడులు

15 Jan, 2019 06:09 IST|Sakshi

2018లో 2.45 లక్షల కోట్ల రాక

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి

ముంబై: ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) పెట్టుబడులు గతేడాది భారీ ఎత్తున వచ్చాయి. 2017లో 26.1 బిలియన్‌ డాలర్లు ఈ రూపంలో రాగా, 2018లో ఏకంగా 35 శాతం అధికంగా 35.1 బిలియన్‌ డాలర్ల (రూ.2,45,700 కోట్లు) మేర పెట్టుబడులు తరలివచ్చాయి. భారీ డీల్స్‌ 2017లో చోటు చేసుకోవడమే ఈ వృద్ధికి కారణం. ఇక పీఈ/వీసీల పెట్టుబడుల ఉపసంహరణ విలువ 2018లో 26 బిలియన్‌ డాలర్ల (రూ.1,82,000 కోట్లు) మేర ఉంది. ఇది క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది. ‘‘పీఈ/వీసీ పెట్టుబడులు, ఉపసంహరణలకు 2018 మంచి సంవత్సరం. మేము ముందుగా అంచనా వేసిన విధంగానే పీఈ, వీసీల పెట్టుబడులు, ఉపసంహరణలు 2018లో నూతన రికార్డు స్థాయికి చేరాయి’’అని ఈవై పార్ట్‌నర్‌ వివేక్‌సోని తమ నివేదికలో తెలిపారు. స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతల వల్ల 2018 ద్వితీయ భాగంలో ప్రైవేటు పెట్టుబడులకు విఘాతం కలిగినప్పటికీ... కొనుగోళ్లు, స్టార్టప్‌ యాక్టివిటీతో ఈ ప్రభావం తగ్గిపోయిందని వివరించారు.

డీల్స్‌ వివరాలు...
► 2018లో 500 మిలియన్‌ డాలర్లు (రూ.3,500 కోట్లు), అంతకంటే ఎక్కువ విలువ కలిగిన 12 డీల్స్‌ జరిగాయి. ఇందులో ఎనిమిది డీల్స్‌ విలువ ఒక్కోటీ బిలియన్‌ డాలర్లపైనే ఉండడం గమనార్హం.
► 76 ఒప్పందాల విలువ 100 మిలియన్‌ డాలర్ల (రూ.700 కోట్లు) కంటే ఎక్కువ ఉంది. వీటి మొత్తం విలువ 25.9 బిలియన్‌ డాలర్లు. 2018లో వచ్చిన పీఈ, వీసీ మొత్తం పెట్టుబడుల్లో 74 శాతం.
► 2018లో మొత్తం డీల్స్‌ 761గా ఉన్నాయి. 2017లో ఉన్న 594 డీల్స్‌ కంటే 28 శాతం ఎక్కువ.
► స్టార్టప్‌ పెట్టుబడులు బలంగా ఉన్నాయి. సాఫ్ట్‌ బ్యాంకు, టెన్సెంట్, నాస్పర్స్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇందుకు తోడ్పడింది.
► అతిపెద్ద డీల్‌... హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో జీఐసీ, కేకేఆర్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఓమర్స్‌ చేసిన 1.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి కావడం గమనార్హం.
► ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ ప్రవేశంతో సాఫ్ట్‌బ్యాంకు, టైగర్‌ గ్లోబల్, మరికొంత మంది ఇన్వెస్టర్లు తప్పకున్న విషయం తెలిసిందే. ఇది 16 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్‌. దేశ పీఈ/వీసీ మార్కెట్లో ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద డీల్‌.
► పీఈ, వీసీ పెట్టుబడుల ఉపసంహరణ డీల్స్‌ జరిగిన రంగాలను గమనిస్తే... ఈ కామర్స్‌ (16.4 బిలియన్‌ డాలర్లు), టెక్నాలజీ(రూ.1.8 బిలియన్‌ డాలర్లు), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (1.5 బిలియన్‌ డాలర్లు) ముందున్నాయి.

వ్యాపారంపై తగ్గిన విశ్వాసం!
జనవరి–మార్చి మధ్య పరిస్థితిపై డీఅండ్‌బీ నివేదిక
న్యూఢిల్లీ: వ్యాపార ఆశావాదం జనవరి–మార్చి త్రైమాసికానికి తగ్గింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీ అండ్‌ బీ)కాంపోజిట్‌ బిజినెస్‌ ఆప్టమిజమ్‌ ఇండెక్స్‌ ఈ త్రైమాసికానికి సంబంధించి 73.8గా ఉంది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చిచూస్తే, ఈ సూచీ 7 శాతం తగ్గింది. వచ్చే కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల ఫలితంపై అనిశ్చితి, సంస్కరణల అజెండా కొనసాగడంపై సందేహాలు వ్యాపార ఆశావహ సూచీ తగ్గడానికి కారణమని డీ అండ్‌ బీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌ సిన్హా పేర్కొన్నారు.

అమెరికా మందగమనం, ప్రపంచ ఆర్థిక వృద్ధి బలహీనత వంటి అంశాలూ దేశీయ వృద్ధిపై ఆందోళనలను పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాపార అంచనాలపై వ్యాపార ప్రతినిధులు ఆరు అంశాలపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా సూచీ కదలికలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.  సూచీకి సంబంధించి పరిగణనలోకి తీసుకునే మొత్తం ఆరు ప్రమాణాల్లో ఐదు ( నికర ఆదాయం, కొత్త ఆర్డర్లు, అమ్మకాల పరిమాణం, నిల్వలు, అమ్మకపు ధర) అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య కాలంతో పోల్చితే ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. దీంతో ఉపాధి కల్పనకు సంబంధించి ఆశావహ పరిస్థితి 7% పెరిగినా, మొత్తం ఫలితం ప్రతికూలంగా ఉంది.

మరిన్ని వార్తలు