ట్రెండ్‌పై గణాంకాల ఎఫెక్ట్

3 Mar, 2014 08:23 IST|Sakshi
ట్రెండ్‌పై గణాంకాల ఎఫెక్ట్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ సాధించిన 4.5% వృద్ధి ఈ వారం మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలకు వెలువడుతున్న ఆటో దిగ్గజాల అమ్మకాలు, విదేశీ సంకేతాలు సెంటిమెంట్‌కు కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఈ అంశాలతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని అంచనా వేశారు.

క్యూ3లో జీడీపీ సగటు వృద్ధిని నమోదు చేయగా, విశ్లేషకులు 4.7 శాతం వృద్ధిని అంచనా వేశారు. ఇక ఫిబ్రవరి నెలకు ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్ అమ్మకాలు క్షీణించాయి. కాగా, గడిచిన వారం మార్కెట్లు 2013 నవంబర్ తరువాత గరిష్ట స్థాయిలో లాభపడ్డ సంగతి తెలిసిందే. వారం మొత్తానికి సెన్సెక్స్ 419 పాయింట్లు లాభపడింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టే అవకాశమున్నదని అత్యధిక శాతం మంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 మందగమనంలోనే మౌలికం...
 జనవరి నెలకు మౌలిక రంగానికి చెందిన కీలక పరిశ్రమలు కుదేలయ్యాయి. కేవలం 1.6% వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక మరోవైపు 2014 జనవరి వరకూ గత 10 నెలల్లో ద్రవ్యలోటు అంచనాలను మించిపోయింది. వెరసి ఇటు పెరిగిన ద్రవ్యలోటు, అటు మందగించిన జీడీపీ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చునని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అంచనా వేశారు. ఈ అంశాలపై సోమవారం మార్కెట్లు ఎలా స్పందించేదీ చూడాల్సి ఉన్నదని చెప్పారు. గడిచిన శుక్రవారం సాయంత్రం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ జీడీపీ గణాంకాలు, ఆటో అమ్మకాలు ఈ వారం ఇండెక్స్‌ల కదలికలను నిర్దేశిస్తాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి వివరించారు.

 సెన్సెక్స్ 20,850-21,500 మధ్య...
 సాంకేతిక అంశాల ప్రకారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 20,850-21,500 పాయింట్ల స్థాయిలో కదలవచ్చునని జిగ్నేష్ అభిప్రాయపడ్డారు. ఇక నిఫ్టీ అయితే 6,150-6,350 శ్రేణిలో తిరిగే అవకాశముందని అంచనా వేశారు. గత వారం ఎఫ్‌ఐఐలు ఈక్విటీలలో కొనుగోళ్లు పెంచిన నేపథ్యంలో దేశీ ఫండ్స్ కూడా ఈ బాటను అనుసరించేదీ లేనిదీ గమనించాల్సి ఉన్నదని బ్రోకింగ్ సంస్థలు వ్యాఖ్యానించాయి. ఫిబ్రవరి నెలకు తయారీ రంగ పనితీరును వెల్లడించే హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ గణాంకాలు సోమవారం(3న) వెల్లడి కానున్నాయి. ఇవి కూడా ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఇక బుధవారం(5న) సర్వీస్ రంగ సంబంధిత గణాంకాలు వెలువడనున్నాయి.

 రాజకీయాల ప్రభావం
 దేశీయంగా రాజకీయ మార్పులు, అంతర్జాతీయ స్థాయిలో ఉక్రెయిన్‌లో నెలకొన్న అశాంతి వంటి అంశాలను మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఈ బాటలో సోమవారం వెలువడనున్న చైనా తయారీ రంగ గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని చెప్పారు. చైనా, యూరో దేశాల విధానకర్తల సమావేశాలు సైతం ఈ వారంలో జరగనున్నాయి. చైనా ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లపై యూరోపియన్ కేంద్ర బ్యాంకు నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ మార్కెట్లపై ఎఫెక్ట్ చూపుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు