నష్టాలతో వీడ్కోలు

1 Jan, 2020 03:34 IST|Sakshi

304 పాయింట్లు పతనమై 41,254కు సెన్సెక్స్‌

87 పాయింట్లు నష్టపోయి 12,168కు నిఫ్టీ  

సూచీల ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లు పలు మార్లు బ్రేక్‌ అయిన 2019 చివరి రోజు మాత్రం స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల్లో ముగిసింది.  ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్రం తప్పే అవకాశాలున్నాయన్న అంచనాలు, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మంగళవారం మార్కెట్‌ పతనం తప్పలేదు.  నవంబర్‌ నెల(2019) మౌలిక రంగ గణాంకాలు వెలువడనుండటం (మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి)తో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇంట్రాడేలో 422 పాయింట్ల మేర కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 304 పాయింట్ల నష్టంతో 41,254 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 87 పాయింట్లు పతనమై 12,168 పాయింట్ల వద్దకు చేరింది.

422 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
సెన్సెక్స్‌ లాభాల్లో మొదలైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో 49 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 373 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 422 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. సంవత్సరాంత సెలవుల కారణంగా టోక్యో, దక్షిణ కొరియా మార్కెట్లలో ట్రేడింగ్‌ జరగలేదు. షాంఘై సూచీ లాభపడగా, హాంగ్‌ కాంగ్‌ సూచీ నష్టపోయింది. యూరప్‌ మార్కెట్లు నష్టపోయాయి.

11 లక్షల కోట్లు పెరిగిన  సంపద..
గత ఏడాదిలో సూచీలు భారీగా పెరిగాయి. సెన్సెక్స్‌ 5,185 పాయింట్లు(14%), నిఫ్టీ 1,306 పాయింట్లు(12%) మేర లాభపడ్డాయి. భారీ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.11 లక్షల కోట్లకు మించి పెరిగింది. రూ.1,55,53,861 కోట్లకు చేరింది. ప్రపంచ మార్కెట్లతో పోల్చితే మన మార్కెట్టే 2019లో బాగా లాభపడిందని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ రశి్మక్‌ ఓజా చెప్పారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 1,430 కోట్ల డాలర్లు, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ 750 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారని వివరించారు.

>
మరిన్ని వార్తలు