స్వల్ప నష్టాలు

23 Feb, 2018 00:58 IST|Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

25 పాయింట్ల పతనంతో 33,820కు సెన్సెక్స్‌

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండడం, రూపాయి బలహీనతల కార ణంగా స్టాక్‌ మార్కెట్‌ గురువారం క్షీణించింది. ఫిబ్రవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సూచీలు ఒడిదుడుకులకు గురయ్యా యి. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 25 పాయింట్ల నష్టంతో 33,820 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,382 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 153 పాయింట్లు నష్టపోయింది.   

ద్రవ్యోల్బణ భయాలు...
రేట్ల పెంపు అవకాశాలు అధికంగానే ఉన్నాయని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మినట్స్‌ వెల్లడించడం, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతుండటంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఈ ప్రభావంతో గురువారం ఆసియా మార్కెట్లు నష్టపోవడం మన మార్కెట్‌పై ప్రభావం చూపించింది. ఈ నెల 6–7 మధ్య జరిగిన ఆర్‌బీఐ మోనేటరీ పాలసీ కమిటీ సమావేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళన, ఆర్థిక వ్యవస్థ రికవరీపై అనిశ్చితి వ్యక్తమయ్యాయని వెల్లడి కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

ఇక డాలర్‌తో రూపాయి మారకం ఒక దశలో 34 పైసలు క్షీణించి తాజా మూడు నెలల కనిష్టానికి పడిపోవడం (ఇంట్రాడేలో) ప్రతికూల ప్రభావం చూపించింది. అయితే  ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. ఇక ఈ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల కాలానికి సెన్సెక్స్‌ 2,231 పాయింట్లు, నిఫ్టీ 687 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.  

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో రేట్లను పెంచాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు వెల్లడించాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. దీనికి తోడు ఈ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. భారత పదేళ్ల బాండ్ల రాబడులు పెరగడం, రూపాయి క్షీణత.. భవిష్యత్తులో అప్రమత్త ట్రేడింగ్‌ను సూచిస్తున్నాయని పేర్కొన్నారు.  

ఐడీబీఐ బ్యాంక్‌ షేరు జోరు: ఐడీబీఐ బ్యాంక్‌ 5% లాభపడి రూ.74 వద్ద ముగిసింది. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ 21% ఎగసింది. ఈ బ్యాంక్‌లో 10% వాటా విక్రయం కోసం ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన పీఈ సంస్థతో చర్చలు జరుపుతోందన్న వార్తల కారణంగా ఈ షేర్‌ పెరుగుతోందని నిపుణులంటున్నారు. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో స్వల్పంగా లాభపడిన పీఎన్‌బీ షేరు గురువారం 2% పతనమై రూ.115 వద్ద ముగిసింది. ఇక గీతాంజలి జెమ్స్‌ షేర్‌ 5% క్షీణించి రూ.26కి పతనమైంది. గత వారం రోజుల్లో ఈ షేర్‌ 59% వరకూ నష్టపోయింది.

మరిన్ని వార్తలు