గతవారం బిజినెస్

7 Sep, 2015 00:49 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ కనీస స్థాయి రుణ రేటు
భారత ప్రై వేటు రంగంలో రెండవ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తన కనీస రుణ రేటు (బేస్ రేటు)ను 0.35 శాతం తగ్గించింది.  దీనితో ఈ రేటు 9.35 శాతానికి చేరింది. ఇది బ్యాంకింగ్ పరిశ్రమలో అతి తక్కువ బేస్ రేటు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐల బేస్‌రేటు 9.7 శాతంగా ఉంది.
 
స్టార్టప్‌లలో రతన్ టాటా పెట్టుబడులు
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా డేటా అనలిటిక్స్  సంస్థ ఇన్ఫినిట్ అనలిటిక్స్‌లోను... ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్ ప్లేస్ హోలాషెఫ్‌లోను పెట్టుబడులు పెట్టారు. ఈ రెండూ స్టార్టప్ సంస్థలే. అయితే రెండింటిలోనూ ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశారన్నది వెల్లడి కాలేదు.
 
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు కీలక హోదా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐని, ప్రై వేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకుని.. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకులుగా (డీ-ఎస్‌ఐబీ) రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. ఇవి భారీ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తున్నందున..ఒకవేళ వీటి సర్వీసులకు విఘాతం కలిగినా ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి సమస్యలు రాకుండా,  వీటికి మరింత అత్యున్నత స్థాయి పర్యవేక్షణ నిబంధనలు వర్తిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది.
 
డెయిరీ మార్కెట్‌లోకి ఐటీసీ
సిగరెట్లు, వంటనూనెలు, సబ్బులు, బిస్కెట్లు వంటి తదితర ఉత్పత్తులను తయారుచేసే ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ డెయిరీ మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. త్వరలో నెయ్యితో తమ తొలి డెయిరీ ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తామని ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తెలిపారు. నెయ్యి తర్వాత పాలు,  వెన్న, జున్ను, చాక్లెట్స్ వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు.
 
రైల్వే తొలి ఎఫ్‌డీఐ ఆఫర్‌కు 3 బిడ్లు
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేలో తొలి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఆఫర్‌కు మూడు అంతర్జాతీయ కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. బీహార్‌లోని మాధేపురాలో ఆధునిక ఎలక్ట్రిక్ రైలు పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీని రూ.1.300 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. సీమెన్స్, ఆల్‌స్టోమ్, బొంబార్డీయిర్.. ఈ మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమ తమ బిడ్‌లను దాఖలు చేశాయి.
 
ఎఫ్‌ఐఐలకు మ్యాట్ లేనట్టే!
వివాదాస్పదంగా మారిన ‘కనీస ప్రత్యామ్నాయ పన్ను’ (మ్యాట్) విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (ఎఫ్‌ఐఐ) ఊరట లభించనుంది. ఎఫ్‌ఐఐలపై మ్యాట్ విధించరాదంటూ జస్టిస్ ఏపీ షా కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిం ది. ఇందులో భాగంగా ఎఫ్‌ఐఐలపై మ్యాట్ కేసుల విచారణ పక్కన పెట్టాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు  క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1కి పూర్వం కేసుల విషయంలో రికవరీలు ఆపేయాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది.
 
చిన్న చమురు క్షేత్రాలు ప్రైవేట్ పరం!
ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు అప్పగించిన 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేసి ప్రై వేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇప్పటిదాకా అమల్లో ఉన్న... ‘లాభాల్లో వాటాల విధానం’ కాకుండా ఇకపై స్థూల ఆదాయాల్లో వాటాలివ్వాలనే విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
 
11 శాతం తగ్గిన ఏటీఎఫ్ ఇంధన ధర
అంతర్జాతీయంగా ఇంధన ధరలు క్షీణించడంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 11.7 శాతం తగ్గింది. అలాగే సబ్సిడీయేతర వంటగ్యాస్ ఎల్‌పీజీ ధర కూడా సిలిండర్‌కు రూ.25.5లు కిందకు దిగివచ్చింది. దేశ రాజధానిలో ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ.5,469 (11.7 శాతం) తగ్గి రూ.40,938లుగా ఉందని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
 
జెట్ ఎయిర్‌వేస్‌లో జెట్‌లైట్ విలీనం!
జెట్‌లైట్ ఎయిర్‌వేస్ తన మాతృ సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో విలీనమవుతోంది. ఈ విలీనానికి కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. కంపెనీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడానికి, ఒకే రకమైన ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించడానికి ఈ విలీనం చేపట్టినట్లు జె ట్ ఎయిర్‌వేస్ పేర్కొంది. జెట్ ఎయిర్‌వేస్ 2007 ఏప్రిల్ నెలలో సహారా ఎయిర్‌లైన్స్‌ను రూ.1,450 కోట్లకు కొనుగోలు చేసింది. తర్వాత సహారా ఎయిర్‌లైన్స్ పేరు జెట్‌లైట్‌గా రూపాంతరం చెందింది.
 
ఆర్థికాభివృద్ధి అంతంతే
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2015-16 : ఏప్రిల్-జూన్) నిరాశను మిగిల్చింది. ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేక  కేవలం 7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మూడు ప్రధాన రంగాలు-  సేవలు, తయారీ, వ్యవసాయం పేలవ పనితీరు దీనికి కారణం. మరోవైపు జీడీపీ నెమ్మదించడం సెప్టెంబర్ 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల కోత ఆశలను పెంచుతోంది.
 
2,4 శనివారాల్లో ఆర్‌టీజీఎస్ సేవలు బంద్
ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఆయా రోజుల్లో ఇకపై ఆర్‌టీజీఎస్ సేవలు కూడా అందుబాటులో ఉండవని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగతా శనివారాల్లో మాత్రం పూర్తిగా రోజంతా సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆర్‌టీజీఎస్ వేళల్లో కూడా మార్పులు చేసినట్లు ఆర్‌బీఐ వివరించింది. దీని ప్రకారం రెండో, నాలుగో శనివారాలు మినహా మిగతా అన్ని రోజుల్లో కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఆర్‌టీజీఎస్ వేళలు ఉదయం 8 గం. ల నుంచి సాయంత్రం 4.30 గం.ల దాకా ఉంటాయి.
 
ఎలక్ట్రానిక్స్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దాదాపు రూ. 1.07 లక్ష కోట్ల పైగా విలువ చేసే  పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు టెలి కం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గత 14 నెలలుగా ఎలక్ట్రానిక్ క్లస్టర్‌ల ఏర్పాటును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, దానికి తగ్గట్లుగానే పెట్టుబడి ప్రతిపాదనలూ వస్తున్నాయని చెప్పారు.
 
ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ పథకం (ఎంఎస్‌ఐపీఎస్) కింద ఈ ప్రతిపాదనలకు పెట్టుబడి వ్యయాలపై సబ్సిడీ మొదలైనవి అందించనున్నట్లు పేర్కొన్నారు.
 
నియామకాలు
- రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
- ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా రతన్ పి. వాతాల్ (59) నియమితులయ్యారు.
- సెయిల్ కొత్త చైర్మన్‌గా పీకే సింగ్ ఎంపికయ్యారు.
- సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియాం) కొత్త ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి ఎంపికయ్యారు.
- ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ సిప్లా, ఉమాంగ్ వోరాను గ్లోబల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమించింది. ఆయన గతంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్తర అమెరికా బిజినెస్ హెడ్‌గా ఉండేవారు.
 
డీల్స్..
- అమెరికాలోని ఇన్వాజెన్ ఫార్మాస్యూటికల్స్, ఎక్సెలాన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలను దేశీ కంపెనీ సిప్లా కొనుగోలు చేసింది. హెటిరో గ్రూప్ ప్రమోటర్లకు చెందిన ఈ రెండు కంపెనీలనూ రూ.3,652 కోట్లకు కొనుగోలు చేశామని సిప్లా తెలియజేసింది.
- టేబుల్ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్ డైన్‌అవుట్ బెంగళూరుకు చెందిన ఇన్‌రెస్టో సర్వీస్‌ను కొనుగోలు చేసింది.
- అమెరికాకు చెందిన రెడ్యూస్ డేటా స్టార్టప్‌ను ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ కొనుగోలు చేసింది.
- ఆన్‌లైన్ ఈ-కామర్స్ కంపెనీ ‘ఈబే ఇండియా’ 24/7 హోమ్ షాపింగ్ చానల్ ‘బెస్ట్ డీల్ టీవీ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈబే ఒప్పందంలో భాగం గా బెస్ట్ డీల్ టీవీ సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులను అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాలకు ఈబే ఎగుమతి చేస్తుంది.

మరిన్ని వార్తలు