గతవారం బిజినెస్‌

29 May, 2017 01:00 IST|Sakshi
గతవారం బిజినెస్‌

నియామకాలు
టాటా సన్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)గా సౌరభ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. గ్రూప్‌కు సంబంధించిన మూలధన కేటాయింపుల నిర్ణయాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలను ఇకపై సౌరభ్‌ చూసుకోనున్నారు. ఇక టాటా సన్స్‌ గ్రూప్‌ జనరల్‌ కౌన్సెల్‌గా శువ మండల్‌ ఎంపికయ్యారు.  

గూగుల్‌ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న రాజన్‌ ఆనందన్‌ తాజాగా ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే ఐఏఎంఏఐ వైస్‌ చైర్మన్‌గా మేక్‌మైట్రిప్‌ చైర్మన్, సీఈవో దీప్‌ కల్రా ఎంపికయ్యారు. ఇక ఐఏఎంఏఐ ట్రెజరర్‌గా ఫేస్‌బుక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా, దక్షిణాసియా) ఉమాంగ్‌ బేడి నియమితులయ్యారు.


పేటీఎం బ్యాంక్‌ కార్యకలాపాలు షురూ
డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం.. పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. అలాగే కనీస బ్యాలెన్స్‌ నిబంధనలు ఉండబోవని, ఆన్‌లైన్‌ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్‌ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. ఎయిర్‌టెల్, ఇండియా పోస్ట్‌ తర్వాత పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది.

ఇక బీమా ఐపీవోలు!
దిగ్గజ బీమా కంపెనీలు ఈ ఏడాది వరుసగా పబ్లిక్‌ ఇష్యూకు రాబోతున్నాయి. జాబితాలో ముందు వరుసలో ఎస్‌బీఐ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, యూటీఐ ఫండ్‌ నిలుస్తున్నాయి.

ఆకర్షణీయ ధరలో హెచ్‌సీఎల్‌ టెక్‌ బైబ్యాక్‌
దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్ల బైబ్యాక్‌ ధరను ప్రకటించింది. మార్కెట్‌ ధర కంటే 17 శాతం ప్రీమియంతో ఒక్కో షేరును రూ.1,000 ధరకు బైబ్యాక్‌ చేయనున్నట్టు తెలియజేసింది. ప్రపోర్షనేట్‌ విధానంలో టెండర్‌ ఆఫర్‌ ద్వారా దీన్ని నిర్వహించనున్నట్టు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు తెలిపింది. రూ.3,500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ బైబ్యాక్‌ చేయనుంది.  

ఎఫ్‌డీఐల చిరునామా భారత్‌
ప్రపంచంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షిస్తున్న దేశంగా భారత్‌ వరుసగా రెండో ఏడాదీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2016వ సంవత్సరంలో 62.3 బిలియన్‌ డాలర్ల (రూ.3.99 లక్షల కోట్లు సుమారు) ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు చెందిన ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్‌ విభాగం ’ఎఫ్‌డీఐ 2017’ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ఎఫ్‌డీలను రాబట్టడంలో చైనా, అమెరికాలు భారత్‌ వెనుకనే నిలిచాయి.

ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్‌..
దిగ్గజ వాహన తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ’ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌ ’స్విఫ్ట్‌’ తాజాగా అదే కంపెనీకి చెందిన ’ఆల్టో’ మోడల్‌ను వెనక్కు నెట్టింది. దేశీ మార్కెట్‌లో ఏప్రిల్‌ నెల వాహన విక్రయాల్లో ’స్విఫ్ట్‌’.. బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా అవతరించింది. కాగా మారుతీ ఎప్పటిలాగే ఇండియన్‌ ప్యాసెంజర్‌ వాహన మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఏడు కార్లు ’టాప్‌10 బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్స్‌’ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ఇక మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఆక్రమించింది.

మరిన్ని వార్తలు