గతవారం బిజినెస్‌

26 Dec, 2016 01:16 IST|Sakshi
గతవారం బిజినెస్‌

ట్రాయ్‌పై ట్రిబ్యునల్‌కు ఎయిర్‌టెల్‌
రిలయన్స్‌ జియో 90 రోజుల కాల పరిమితి తీరిన తర్వాత కూడా ఉచిత సేవలు కొనసాగించేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) అనుమతించడాన్ని సవాలు చేస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. జియో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ట్రాయ్‌ ప్రేక్షక పాత్ర వహిస్తోందని పేర్కొంది. డిసెంబర్‌ 3 తర్వాత జియో ఉచిత వాయిస్, డేటా సేవలు కొనసాగించకుండా ట్రాయ్‌ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్‌టెల్‌ తన 25 పేజీల పిటిషన్‌లో ట్రిబ్యునల్‌ను కోరింది. ట్రాయ్‌ టారిఫ్‌ ఆదేశాల ఉల్లంఘన ఈ ఏడాది మార్చి నుంచి కొనసాగుతోందని, దీంతో తమకు రోజువారీ నష్టాలు వాటిల్లుతున్నాయని... ఉచిత కాల్స్‌ వల్ల విపరీతమైన ట్రాఫిక్‌తో తమ నెట్‌వర్క్‌కు విఘాతం కలుగుతున్నట్టు ఎయిర్‌టెల్‌ ఆరోపించింది.

మారుతీకి డీమోనిటైజేషన్‌ దెబ్బ
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం గణనీయంగానే పడింది. గతేడాది అక్టోబర్‌–నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే వ్యవధిలో బుకింగ్స్‌ 20 శాతం మేర క్షీణించాయి. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా నగదు కొరత నెలకొనడంతో డిమాండ్‌ పడిపోవడమే ఇందుకు కారణమని సంస్థ పేర్కొంది. అయితే, ఈ నెలలో మా త్రం పరిస్థితులు కాస్త మెరుగయ్యాయని.. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈసారి బుకింగ్‌లు 7% మేర పెరిగాయని వివరించింది.

కింగ్‌ఫిషర్‌ విల్లా కొనేవారు లేరు
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు విజయ్‌ మాల్యాకు చెందిన గోవాలోని విల్లాను కొనేవారే కరువయ్యారు. విల్లా రిజర్వు ధర ను 5 శాతం తగ్గించి.. రూ.81 కోట్లుగా నిర్ణయించినా కూడా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం. మాల్యా నుంచి రూ.9,000 కోట్ల రుణ మొత్తాన్ని రాబట్టుకోవడానికి బ్యాంక్‌ కన్సార్షియం విల్లాను విక్రయానికి పెట్టిన ప్రతిసారీ విఫలమౌతూనే ఉంది. ‘డీమోనిటైజేషన్‌ కారణంగా రియల్టీలో స్తబ్ధత నెలకొంది. ప్రాపర్టీ ధరలు తగ్గాయి. దీంతో బ్యాంకుల కన్సార్షియం విల్లా ధరను మరింత తగ్గించొచ్చని బిడ్డర్లు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుత వేలానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా
ఆర్థిక సేవల రంగంలో పేరొందిన ఆదిత్యా బిర్లా గ్రూప్‌.. తొలిసారిగా ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీహెచ్‌ఐసీఎల్‌) బ్రాండ్‌ పేరిట మార్కెట్లోకి ప్రవేశించింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఎంఎంఐ హోల్డింగ్స్‌తో కలిసి 51:49 జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించినట్లు ఏబీహెచ్‌ఐసీఎల్‌ సీఈఓ మయాంక్‌ భత్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రూపుల్లో 4 రకాల పాలసీలు, ఒక రిటైల్‌ పాలసీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది యూటీఐ ఎంఎఫ్‌ ఐపీఓ!
మ్యూచువల్‌ ఫండ్‌ దిగ్గజం యూటీఐ మ్యూచువల్‌  ఫండ్‌ ఐపీఓకు రానుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయని యూటీఐ ఎండీ, లియో పురి చెప్పారు. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ క్షణమైనా అనుమతి లభించగలదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే మర్చంట్‌  బ్యాంకర్లను నియమిస్తామని, సెబీ ఆమోదం కోసం దరఖాస్తు చేస్తామని వివరించారు.

వేదాంత రిసోర్సెస్‌కు జరిమానా
దేశీ దిగ్గజ మైనింగ్‌ కంపెనీ ’వేదాంత రిసోర్సెస్‌’కు లండన్‌ హైకోర్టు 10 కోట్ల డాలర్లమేర (దాదాపు రూ.680 కోట్లు) జరిమానా విధించింది. 2013 కాపర్‌ ప్రైజ్‌ అగ్రిమెంట్‌కు సంబంధించి.. జాంబియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీకి ఈ మొత్తాన్ని 30 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది. దీంతో వేదాంతకు జాంబియాలో ఉన్న కొన్‌కొలా కాపర్‌ మైన్స్‌ (కేసీఎం) అనే అనుబంధ కంపెనీ... ప్రభుత్వ రంగ జాంబియా కన్సాలిడేటెడ్‌ కాపర్‌ మైన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్స్‌ (జెడ్‌సీసీఎం–ఐహెచ్‌)కు దాదాపు 10 కోట్ల డాలర్లను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాల్‌ డ్రాప్స్‌కి టోల్‌ఫ్రీ నెంబర్‌.. ’1955’!
కేంద్ర ప్రభుత్వం కాల్‌ డ్రాప్స్‌కు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాల్‌ డ్రాప్స్‌కు ’1955’ నెం బర్‌ కేటాయించినట్లు అధికారిక సమాచారం. ఈ నెంబర్‌ ద్వారా టెలికం సబ్‌స్క్రైబర్ల కాల్‌ డ్రాప్స్‌పై ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వొచ్చు. ’1955’ నెంబర్‌ కేటాయింపు అన్ని టెల్కోలకు తప్పనిసరి. ఈ నెంబర్‌ ఎస్‌టీడీ, లోకల్‌ కాలింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్‌ఎల్‌ ఈ నెంబర్‌ అమలు, నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. దీని నుంచి టెల్కోలు ఎలాంటి ఫీజులను వసూలు చేయకూడదు. ఇక టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా ఈ నెంబర్‌ను ప్రారంభిస్తారని సమాచారం.

ఫ్రీచార్జ్‌ ఈ–వాలెట్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌...
డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ’ఫ్రీచార్జ్‌’ తాజాగా తన యూజర్ల కోసం కొత్త ఈ–వాలెట్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కస్టమర్లు/వ్యాపారులు వారి మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్న సందర్భాల్లో వాలెట్‌ బ్యాలెన్స్‌పై రూ.20,000 వరకూ ఉచిత బీమాను పొందొచ్చు. ఇందుకోసం ఫ్రీచార్జ్‌ కంపెనీ.. రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లిస్తే డిస్కౌంట్‌!
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ’బీఎస్‌ఎన్‌ఎల్‌’ వినియోగదారులు వారి బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా 0.75 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చని టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ పోర్టల్‌ లేదా బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పోస్ట్‌–పెయిడ్‌ (ల్యాండ్‌లైన్‌/బ్రాడ్‌బాండ్‌/జీఎస్‌ఎం) బిల్లులు లేదా జీఎస్‌ఎం ప్రి–పెయిడ్‌ రీచార్జ్‌లను చెల్లించడం ద్వారా డిస్కౌంట్‌ పొందొచ్చని తెలిపారు. ఈ సౌలభ్యం డిసెంబర్‌ 22 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించారు.

మధుమేహం ఔషధాల రేట్లు తగ్గింపు!
హెచ్‌ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో వీటి ధరలు 5 నుంచి 44 శాతం దాకా తగ్గనున్నాయి. 29 ఫార్ములేషన్ల రిటైల్‌ ధరలపై కూడా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) పరిమితులు విధించింది. జాబితాలోని నిర్దిష్ట ఔషధాల ధరలు 5–44 శ్రేణిలో తగ్గుతాయని, తగ్గుదల సగటున 25 శాతం మేర ఉండగలదని ఎన్‌పీపీఏ చైర్మన్‌ భూపేంద్ర సింగ్‌ తెలిపారు.

డీల్స్‌..

ఒడిశా కేంద్రంగా పనిచేసే ఐరన్‌ఓర్‌ పెల్లెట్‌ తయారీ కంపెనీ బీఆర్‌పీఎల్‌ను రూ.900 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు టాటా స్టీల్‌ ప్రకటించింది. మెటాలిక్‌ అవసరాలు తీర్చుకునేందుకు, కళింగ్‌నగర్‌/జంషెడ్‌పూర్‌ స్టీల్‌ ప్లాంట్‌లకు ముడి పదార్థాల అవసరాలను తీర్చేందుకు ఈ కొనుగోలు వీలు కల్పిస్తుందని టాటా స్టీల్‌ తెలిపింది.
ఔషధ రంగ దిగ్గజం సన్‌ ఫార్మా తాజాగా అమెరికాకు చెందిన ఎస్‌సీ ఫార్మాస్యూటికల్స్‌లో 14.6 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం 13 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 88 కోట్లు) వెచ్చించింది. అలాగే ఇది నొవార్టిస్‌కు చెందిన ఒడొమ్‌జో అనే క్యాన్సర్‌ ఔషధాన్ని 17.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనుంది.
గుజరాత్‌ స్టేట్‌ పెట్రోకెమికల్‌ కార్పొరేషన్‌ (జీఎస్‌పీసీ)కి చెందిన కేజీ బేసిన్‌ గ్యాస్‌ బ్లాక్‌లో 80 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) వెల్లడించింది. ఈ డీల్‌ విలువ సుమారు 995 మిలియన్‌ డాలర్లుగా (దాదా పు రూ.6,700కోట్లు) ఉండనున్నట్లు సంస్థ వివరించింది.

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ తన టవర్ల వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి విక్రయించనుంది. అంతా నగదు చెల్లింపులతో కూడిన ఈ డీల్‌ విలువ రూ.11,000 కోట్లు. భారత మౌలిక రంగంలో అతి పెద్ద విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ డీల్‌ ఇదేనని ఆర్‌కామ్‌ తెలిపింది.

whatsapp channel

మరిన్ని వార్తలు