గతవారం బిజినెస్

1 Aug, 2016 01:11 IST|Sakshi

నియామకాలు
ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా సంజీవ్ పురి నియమితులయ్యారు. 
ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్

దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్‌గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. జూన్ నెల చివరకు.. టీసీఎస్‌లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి.

భారత్‌లోకి అమెజాన్ సర్వీస్ ‘ప్రైమ్’
ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి పలు ఈ-కామర్స్ ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’ తాజాగా తన ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్‌ను (ప్రైమ్ యూజర్లు) ఉచితంగా 1, 2 రోజుల్లోనే డెలివరీ పొందొచ్చు. కాగా ఈ సర్వీసులు అన్ని వస్తువులకు వర్తించదు. ఈ వెసులుబాటు ఉన్న ప్రొడక్ట్స్‌పై ప్రై మ్ లోగో కనిపిస్తుంది. ఇక ఈ సౌకర్యం దాదాపు 100 పట్టణాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

ఫోర్బ్స్ ‘సూపర్-50’లో టీసీఎస్, ఇన్ఫీ
ఫోర్బ్స్ ఇండియా తాజా ‘సూపర్-50’ జాబితాలో పలు సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్ దిగ్గజాలు స్థానం పొందాయి. ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా, లుపిన్.. ప్రై వేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు జాబితాలో ఉన్నాయి. తాజా జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎంఆర్‌ఎఫ్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ న్సూమర్ హెల్త్‌కేర్, ఫైజర్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు స్థానం కోల్పోయాయి.

రూ.59,547 కోట్ల రుణాలు రద్దు
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.59,547 కోట్లమేర రుణాల్ని రద్దు చేశాయని కేంద్రం తెలిపింది. వీటిల్లో ఎస్‌బీఐ రూ.15,763 కోట్ల రుణాల్ని రద్దు చేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ పేర్కొన్నారు. ఇక పీఎన్‌బీ రూ.7,340 కోట్ల రుణాల్ని, ఐడీబీఐ రూ.5,459 కోట్ల రుణాల్ని, కెనరా బ్యాంక్ రూ.3,387 కోట్ల రుణాల్ని రద్దు చేశాయని తెలిపారు.

5 కోట్లకు చేరువలో ఎంఎఫ్ ఖాతాలు
దేశంలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్ ఖాతాలు 5 కోట్లకు చేరువలో ఉన్నాయి. జూన్ త్రైమాసికం చివరకి ఎంఎఫ్ ఖాతాల సంఖ్య కొత్తగా 12.61 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 4.89 కోట్లకు ఎగసింది. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది. మొత్తం ఎంఎఫ్ ఖాతాల్లో 95 శాతం వాటాను ఆక్రమించిన రిటైల్ ఖాతాలు వరుసగా ఏడవ త్రైమాసికంలోనూ పెరుగుతూ వచ్చాయి.

ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు 2015-16 (2016-17 అసెస్‌మెంట్ ఏడాది)కు సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్‌ను జూలై 31 లోగా దాఖలు చేయాలి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒక రోజు సమ్మె కారణంగా ట్యాక్స్ రిటర్న్స్ గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆగస్ట్ 31 వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.

విశాఖలో హిందుజా విద్యుదుత్పత్తి
హిందుజా గ్రూపునకు చెందిన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలోని విశాఖపట్నంలో నెలకొల్పిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లో గత సోమవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఒక్కోటీ 520 మెగావాట్ల సామర్థ్యంతో హిందుజా ఇక్కడ రెండు యూనిట్లను ఏర్పాటు చేసింది.

మెర్సిడెస్ నుంచి‘ ఏఎంజీ-43’ మోడల్
మెర్సిడెస్’ తాజాగా ‘ఏఎంజీ ఎస్‌ఎల్‌సీ 43’ మోడల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువ చ్చింది. దీని ధర రూ.77.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఈ టూ సీట్స్ టాప్‌లెస్ కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ ట్విన్ టర్బో ఇంజిన్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ,  ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. 

బెజోస్ ముందుకు.. బఫెట్ వెనక్కు..
అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ తాజాగా బార్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ వారెన్ బఫెట్‌ను వెనక్కు నెట్టారు. దీంతో బెజోస్ ప్రపంచపు మూడవ అత్యంత సంపన్నుడిగా అవతరించారు. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత బెజోస్ సంపద విలువ 65.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బఫెట్ సంపద విలువ 64.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ అంశాలను ఫోర్బ్స్ రియల్ టైమ్ వెల్త్ ట్రాకర్ వెల్లడించింది. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా 78 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ కొనసాగుతున్నారు.

డీల్స్..
యాహూ కంపెనీని కొనుగోలు చేసేందుకు వెరిజాన్ కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం దాదాపు 4.83 బిలియన్ డాలర్లు (సుమారు రూ.32,500 కోట్లు) చెల్లిస్తోంది. కొనుగోలు తర్వాత యాహూ సేవలన్నింటినీ తన అనుబంధ సంస్థ ఏఓఎల్‌తో (అమెరికా ఆన్‌లైన్) అనుసంధానించనున్నట్లు వెరిజాన్ వెల్లడించింది.

ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ జాబాంగ్‌ను చేజిక్కించు కుంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. జబాంగ్‌ను నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్(జీఎఫ్‌జీ)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 7 కోట్ల డాలర్లు(దాదాపు రూ.470 కోట్లు).

చైనీస్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లాఇకో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ‘విజియో’ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను 1.26 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,500 కోట్లు) కొనుగోలు చేసేందుకు చైనా కంపెనీ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ అంగీకరించింది. ఈ డీల్ కింద ఫోసన్ ఫార్మా 86 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది.

ఎల్‌ఐసీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది.  ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఎంఓయూ ప్రకారం.. ఇకపై యాక్సిస్ బ్యాంక్ తన బ్రాంచీల్లో ఎల్‌ఐసీ బీమా పాలసీలను విక్రయిస్తుంది.

ఈ-క్లాసిఫైడ్ సంస్థ క్వికర్, ఆన్‌లైన్ హైరింగ్ ప్లాట్‌ఫార్మ్ హైరీని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు.

సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజ కంపెనీ కాగ్నిజంట్ అమెరికాకు చెందిన ఐడియా కూషర్ కంపెనీని  కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు