గతవారం బిజినెస్‌

19 Jun, 2017 00:51 IST|Sakshi
గతవారం బిజినెస్‌

పరిశ్రమలు మందగించాయ్‌!
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో నిరుత్సాహపరచగా, మే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు ఊరటనిచ్చాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల వివరాలను క్లుప్తంగా చూస్తే... ఏప్రిల్‌ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 3.1 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తితో పోలిస్తే) నమోదయ్యింది. 2016 నెలలో ఈ రేటు 6.5 శాతం. ఇక 2017 మార్చి నెలలో సైతం వృద్ధి రేటు 3.75 శాతంగా నమోదయ్యింది. ఇక మే నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.18 శాతంగా నమోదయ్యింది.

రిలయన్స్‌–బీపీ 40వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ) పీఎల్‌సీ తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. మరిన్ని అంశాల్లో కలసి సాగాలని నిర్ణయించుకున్నాయి. కొన్నేళ్ల విరామం తర్వాత ఇరు సంస్థలు కలసి కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ–6 బ్లాక్‌ పరిధిలో తిరిగి గ్యాస్‌ ఉత్పత్తి, నూతన గ్యాస్‌ అన్వేషణ క్షేత్రాల అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్‌ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి.

తగ్గిన కరెంట్‌ అకౌంట్‌ లోటు
కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ, క్యాడ్‌) 2016–17 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే క్యాడ్‌ 0.7 శాతంగా నమోదయ్యింది. 2015–16లో ఈ రేటు 1.1 శాతంగా ఉంది. విలువ రూపంలో ఇది 130 బిలియన్‌ డాలర్ల నుంచి 112 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.

మళ్లీ మార్కెట్లోకి నోకియా స్మార్ట్‌ఫోన్లు
హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజాగా మూడు నోకియా స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. నోకియా–3, నోకియా–5 స్మార్ట్‌ఫోన్లు కేవలం రిటైల్‌ స్టోర్లలో మాత్రమే లభించనున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.9,499గా, రూ.12,899గా ఉన్నాయి. నోకియా–3 స్మార్ట్‌ఫోన్లు జూన్‌ 16 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇక నోకియా–5 స్మార్ట్‌ఫోన్స్‌ను జూలై 7 నుంచి ప్రిబుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక నోకియా–6 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.14,999గా ఉంది. వీటిని జూలై 14 నుంచి కేవలం అమెజాన్‌.ఇన్‌లో మాత్రమే ప్రిబుకింగ్‌ చేసుకోవచ్చు.

రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ
ప్రభుత్వరంగంలోని ఇండియల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు సంయుక్తంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ ఆయిల్‌ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు ఇవి ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 60 మిలియన్‌ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2 లక్షల కోట్లు. ఒక్క ఐవోసీయే ఇందులో సగం వాటా తీసుకోనుంది. మిగిలిన రెండు సంస్థలు మరో సగం పెట్టుబడులతో 50 శాతం వాటాను పొందుతాయి.

పావుశాతం రేట్లు పెంచిన ఫెడ్‌
అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేటు 1–1.25 శాతానికి చేరుతుంది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును ఫెడ్‌ ఫండ్స్‌ రేటుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఇది రెండో పెంపు. కాగా 2017లో మరో పెంపు ఉంటుందన్న సంకేతాల్ని ఫెడ్‌ వెలువరించింది.

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో భారత్‌ పైకి
గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ (జీఐఐ)–2017లో భారత్‌ 6 స్థానాలు మెరుగుపరచుకుంది. 130 దేశాలు కలిగిన ఈ జాబితాలో 60వ స్థానానికి ఎగబాకిం ది. తద్వారా ఆసియా ప్రాంతపు వర్ధమాన ఇన్నోవేషన్‌ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇక జాబితాలో స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, అమెరికా, యూకే దేశాలు వరుసగా అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనా 22వ స్థానంలో, శ్రీలంక 90వ స్థానంలో, నేపాల్‌ 109వ స్థానంలో, పాకిస్తాన్‌ 113వ స్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌ వరుసగా ఏడవసారి జాబితాలో అగ్ర స్థానంలో ఉంది.

నాణ్యమైన సేవలు.. 12 బ్యాంకులే పాస్‌..
దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. ఇవి ’హై’ రేటింగ్‌ను పొందాయి. ఈ 12 బ్యాంకుల్లో కేవలం ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్‌ ’ఐడీబీఐ’ స్థానం పొందింది. మిగతావన్నీ ప్రైవేట్, విదేశీ బ్యాంకులే. బ్యాంకింగ్‌ కోడ్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (బీసీఎస్‌బీఐ) తాజాగా వార్షిక కోడ్‌ కాంప్లియెన్స్‌ రేటింగ్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ’హై’ రేటింగ్‌ పొందిన బ్యాంకుల్లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, సిటీ బ్యాంక్‌లు ఉన్నాయి.

‘డర్టీ డజన్‌’పై దివాలా చట్టం!
మొండిబకాయిల పని పట్టడంలో భాగంగా మాల్యాను మించిన ఘనులు మరో 12 మందిని ఆర్‌బీఐ గుర్తిం చింది. వారందరిపై దివాలా కోడ్‌ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిం దిగా బ్యాంకుల్ని ఆదేశించింది. మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ 8 లక్షల కోట్లలో 25%... అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం 12 మంది! ‘ఈ 12 ఖాతాలపై తక్షణం దివాలా చట్టం కింద చర్యలు ఆరంభించవచ్చని గుర్తిం చాం’ అని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. అయితే వీరి పేర్లు మాత్రం వెల్లడించలేదు. కానీ వీటిలో ఎస్సాస్‌ స్టీల్, భూషణ్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్, జేపీ ఇన్‌ఫ్రా, ల్యాంకో ఇన్‌ఫ్రా, మోనెత్‌ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్‌టెక్‌ ఆటో, ఎరా ఇన్‌ఫ్రా ఉన్నట్టు సమాచారం.

టెలికం సర్వీసులకు ఫ్లోర్‌ ప్రైస్‌!
టెలికం పరిశ్రమలో ఉచిత ఆఫర్లు ఎక్కువవుతోన్న నేపథ్యంలో టెల్కోలు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. ఇవి వాయిస్, డేటా సేవలపై ఫ్లోర్‌ ప్రైస్‌ను అమలుచేయాలని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ను కోరాయి. ఫ్లోర్‌ ప్రైస్‌ విధానంలో ఒక ఆపరేటర్‌ నిర్దేశించిన ధరకు తక్కువగా వాయిస్, డేటా సర్వీసులను కస్టమర్లకు ఆఫర్‌ చేయకూడదు.

ఐపీవో కాలమ్‌..
∙వరుస ఐపీవోలకు అనిల్‌ అంబానీ గ్రూప్‌ ప్రణాళికలు వేసుకుంటోంది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వచ్చే మార్చిలోపు ఐపీవోకు రానున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఐపీవోకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సంస్థలకూ మాతృ సంస్థ రిలయన్స్‌ క్యాపిటల్‌ కావడం గమనార్హం.  ∙గీతాంజలి జెమ్స్‌కు చెందిన నక్షత్రవరల్డ్‌తోపాటు, కెపాసిటీ ఇన్‌ఫ్రాల పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ అనుమతి మంజూరు చేసింది.  ∙హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌లో భాగమైన జీటీపీఎల్‌ హాత్‌వే లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) రూ. 167–170 ప్రైస్‌బ్యాండ్‌తో జారీ అవుతుంది. జూన్‌ 21న ప్రారంభంకాబోయే ఈ ఆఫర్‌ ఇదే నెల 23న ముగుస్తుంది.

మరిన్ని వార్తలు