గతవారం బిజినెస్‌

28 Aug, 2017 00:36 IST|Sakshi
గతవారం బిజినెస్‌

లాభాల్లోకి వస్తాం: టాటా మోటార్స్‌
టాటా మోటార్స్‌ దేశీ వ్యాపారాన్ని మళ్లీ లాభాల్లోకి మళ్లించడంపై దృష్టి పెడుతున్నట్లు టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ చెప్పారు. ముఖ్యంగా సమస్యాత్మక పరిస్థితులతో ప్రతికూల ప్రభావాలెదుర్కొన్న వాణిజ్య వాహనాల విభాగంపై మరింతగా కసరత్తు చేయనున్నట్లు తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుతో పాటు బీఎస్‌–3 నుంచి బీఎస్‌–4 ప్రమాణాలకు మారాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలు వంటి వాటితో వాణిజ్య వాహనాల వ్యాపారం పలు సవాళ్లు, అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొనాల్సి రావడమే ఇందుకు కారణమని చెప్పారు.

ఉబెర్‌ రైడ్స్‌కు యూపీఐ ద్వారా చెల్లింపు
ఉబెర్‌ తాజాగా తన ప్లాట్‌ఫామ్‌కు యూపీఐ సేవలను అనుసంధానించింది. దీని కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ అయిన 4.5 లక్షలకుపైగా డ్రైవర్లు యూపీఐ ద్వారా పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు. అంటే మనం కూడా ఉబెర్‌ రైడ్స్‌కు అయిన మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించొచ్చు.

ఎయిరిండియా ఆస్తుల విక్రయం షురూ!
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. సంస్థకు వివిధ ప్రాంతాల్లో ఉన్న 27 రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్‌ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా  రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ ఆస్తులకు ఈ–వేలం నిర్వహించనుండగా... బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్‌ 6గా నిర్ణయించారు.

కారు రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ
ఎస్‌బీఐ పరిమిత కాలానికి కారు, బం గారం, వ్యక్తిగత రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి నూటికి నూరు శాతం మినహాయింపునిస్తోంది. గృహ రుణాల టేకోవర్‌పై ఈ తరహా ఆఫర్‌ ఇస్తున్నట్లు వివరించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 దాకా కారు లోన్స్‌పై 100% ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ చేసినట్లు పేర్కొంది. అక్టోబర్‌ 31 దాకా బంగారం రుణాలపై 50% మేర మినహాయింపు కల్పిస్తున్నట్లు  తెలిపింది. సెప్టెంబర్‌ 30 దాకా వ్యక్తిగత రుణాలకు సంబంధించి ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ స్కీముపై 50% మేర ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ చేసినట్లు పేర్కొంది.

సొంతగూటికి నీలేకని
ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని సొంత గూటికి తిరిగొచ్చారు. ఇతర సహ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి కంపెనీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న ఆర్‌ శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తారు. ఇక రవి వెంకటేశన్‌ సహచైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగుతారు. వైస్‌చైర్మన్‌గా కొనసాగుతున్న విశాల్‌ సిక్కా.. బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు జెఫ్రీ ఎస్‌ లేమాన్, జాన్‌ ఎచ్‌మెండీ బోర్డు నుంచి వైదొలిగారు. తాత్కాలిక సీఈవోగాను, ఎండీగాను యూబీ ప్రవీణ్‌ రావు కొనసాగుతారు.

బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం
పటిష్టమైన, భారీ బ్యాంకుల ఏర్పాటు దిశగా మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. విలీన ప్రతిపాదనలను పరిశీలించి, సత్వర నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏఎం ఏర్పాటు యోచన ద్వారా పీఎస్‌బీల విలీనానికి కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. విలీనానికి సంబంధించి ఆయా పీఎస్‌బీల బోర్డుల నుంచి వచ్చే ప్రతిపాదనలను ఏఎం పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు.

మార్కెట్‌లోకి రూ.200 నోట్లు
ఆర్‌బీఐ తొలిసారిగా రూ.200 నోట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. తక్కువ డినామినేషన్‌ కరెన్సీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రూ.200 నోట్లను చెలామణిలోకి తెచ్చినట్లు బ్యాంక్‌ పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం కలిగిన ఈ నోట్లు ప్రకాశవంతమైన పసుపు రంగులో,  సాంచీ స్థూపంతో, మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో ఉంటాయని తెలిపింది.  

26 శాతం పెరిగిన ’మైక్రో’ రుణాలు
సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ) రుణ మంజూరీలు 2017 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 26 శాతం ఎగసి రూ.35,045 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 27,921 కోట్లు. 2017 జూన్‌ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో 2.08 కోట్ల మందికి సూక్ష్మ రుణ మంజూరీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే ఈ సంఖ్య 19 శాతం పెరిగింది.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘డిజిపీవోఎస్‌ మెషీన్లు’
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. ఆల్‌ఇన్‌వన్‌ ‘డిజిపీవోఎస్‌ మెషీన్‌’లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా పలు రకాల డిజిటల్‌ పేమెంట్‌ చెల్లింపులను నిర్వహించవచ్చు. ‘ఒక వర్తకుడు డిజిపీవోఎస్‌ మెషీన్‌ ద్వారా డెబిట్‌/క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌తోపాటు యూపీఐ, భారత్‌ క్యూ ఆర్, ఎస్‌ఎంఎస్‌ పే, పేజాప్, ట్యాప్‌ అండ్‌ పే వంటి పలు డిజి టల్‌ పేమెంట్‌ సర్వీసులను పొందొచ్చు’ అని బ్యాంక్‌ తెలిపింది.

ఆటో మొబైల్స్‌
దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌’.. ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌ను (ఐదో జనరేషన్‌) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది.

దేశీ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్‌’.. ‘కాన్వాస్‌ ఇన్‌ఫినిటీ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.9,999.

ఆటోమొబైల్‌ సంస్థ యమహా.. 250 సీసీ సామర్థ్యంతో ఫేజర్‌ 25 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.28 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ముంబై)గా ఉంది.

మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వీడియోకాన్‌ మొబైల్‌’.. ‘మెటల్‌ ప్రొ 2’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.6,999గా ఉంది.

డీల్స్‌..
అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఈబిక్స్‌.. యూఫస్ట్‌ మనీ ఎక్స్‌ప్రెస్‌లో భాగమైన నగదు బదిలీ సేవల విభాగాన్ని కొనుగోలు చేయనుంది. ఇందుకు ఎంత చెల్లిస్తున్నదీ వెల్లడించలేదు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సేవలు అందించే ఇట్జ్‌క్యాష్‌ కార్డ్‌కి ఈబిక్స్‌ మాతృసంస్థ.

హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ ఇక నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్‌ను డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. ఐఫోన్‌ సహా ఇతర యాపిల్‌ ఉత్పత్తులను భారత మార్కెట్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తామని హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌  ప్రకటించింది. ఈ విషయానికి సంబంధించి యాపిల్‌ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది.

రుణభారంతో సతమతం అవుతున్న ఎస్సార్‌ గ్రూపు తన పరిధిలోని ఎస్సార్‌ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌కు విక్రయించింది. ఎస్సార్‌ ఆయిల్, దాని పరిధిలోని పోర్టు, విద్యుత్తు, రిటైల్‌ ఆస్తులను రాస్‌నెఫ్ట్‌తోపాటు ఇతర ఇన్వెస్టర్ల కన్సార్టియం 12.9 బిలియన్‌ డాలర్లు (రూ.82,500 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే.

వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌లో యూరప్‌ సంస్థ మెడికవర్‌ 22 శాతం వాటా చేజిక్కించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించింది.

విమానయాన సంస్థలు విస్తారా, ఖతర్‌ ఎయిర్‌వేస్‌.. ఇంటర్‌లైన్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఇరు సంస్థల ప్రయాణికులు నిరాటంకంగా గమ్యం చేరుకునేందుకు దోహదపడే థ్రూచెకిన్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ఇంటిగ్రేటెడ్‌ వీసా ప్రాసెసింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ టీటీ సర్వీసెస్‌ (టీటీఎస్‌)ను ఔట్‌సోర్సింగ్‌ మరియు టెక్నాలజీ సర్వీసెస్‌ కంపెనీ వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ చేజిక్కించుకుంది.

మ్యాన్‌కైండ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ప్రెగ్నెన్సీ డిటెక్షన్‌ కిట్‌ ’ప్రెగా న్యూస్‌’ తాజాగా విమానయాన సంస్థ ’స్పైస్‌జెట్‌’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గర్భిణి స్త్రీలకు విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. భాగస్వామ్యంలో భాగంగా స్పైస్‌జెట్‌ గర్భిణి స్త్రీలకు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించనుంది.

అమెజాన్‌కు చెక్‌ పెట్టేందుకు టెక్నాలజీ దిగ్గజం ’గూగుల్‌’, ప్రపంచ అతిపెద్ద రిటైలర్‌ ’వాల్‌మార్ట్‌’ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం వల్ల వినియోగదారులు వాల్‌మార్ట్‌ ఉత్పత్తులను గూగుల్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ మాల్‌ గూగుల్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సేవలు వచ్చే నెలలో అందుబాటులోకి వస్తాయి. అలాగే కస్టమర్లు గూగుల్‌ అసిస్టెంట్, గూగుల్‌ హోమ్‌కు వాయిస్‌ కంట్రోల్‌ ఇవ్వడం ద్వారా కూడా షాపింగ్‌ చేయొచ్చు.

మరిన్ని వార్తలు