గతవారం బిజినెస్‌

4 Sep, 2017 00:45 IST|Sakshi
గతవారం బిజినెస్‌

ప్రపంచంలో తొలి డైమండ్‌ ఫ్యూచర్స్‌!
అనిల్‌ అంబానీ గ్రూప్‌కు చెందిన ఇండియన్‌ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఐసీఈఎక్స్‌).. డైమండ్‌ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్స్‌ ఎక్సే్ఛంజ్‌గా నిలిచింది.

నిఫ్టీ–50లోకి బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్‌
నిఫ్టీ–50 ఇండెక్స్‌లో కొత్తగా బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్‌ పాస్ఫరస్‌ లిమిటెడ్‌ (యూపీఎల్‌)లు ప్రవేశించనున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇప్పటివరకూ భాగమైన ఏసీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), టాటా పవర్‌ షేర్లను నిఫ్టీ–50 నుంచి తొలగించనున్నారు. ఈ మార్పులు సెప్టెంబర్‌ 29నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే నిఫ్టీ నెక్ట్స్‌–50 నుంచి బజాజ్‌ ఫైనాన్స్, దివీస్‌ ల్యాబ్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్‌ స్పిరిట్స్‌లను తొలగించి.. ఏసీసీ, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎంఆర్‌ఎఫ్, టాటా పవర్‌లను చేర్చారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌.. లక్ష వై–ఫై స్పాట్స్‌!!
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ’బీఎస్‌ఎన్‌ఎల్‌’ దేశవ్యాప్తంగా 2019 మార్చి నాటికి లక్ష వై–ఫై స్పాట్స్‌ను ఏర్పాటు చేయనుంది. వీటిల్లో 25,000 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్,ఎండీ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు.  

జూలైలో లక్ష్యాన్ని దాటిన జీఎస్‌టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని పేర్కొన్నారు. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ విధానం కింద రిజిస్టర్‌ అయ్యారని, వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి పన్ను వసూళ్లు జరిగాయని వివరించారు. కాగా మొత్తంగా రూ.91,000 కోట్లు మాత్రమే జూలైలో జీఎస్‌టీ ద్వారా లభిస్తాయని వార్షిక బడ్జెట్‌ అంచనా వేసింది.

హచిసన్‌కు పన్ను నోటీసులు
బ్రిటన్‌ సంస్థ వొడాఫోన్‌కు టెలికం వ్యాపార విక్రయ డీల్‌కు సంబంధించి రూ. 32,320 కోట్లు పన్ను కట్టాలంటూ హాంకాంగ్‌కి చెందిన హచిసన్‌ సంస్థకు ఆదాయ పన్ను శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇందులో పన్ను రూపంలో రూ. 7,900 కోట్లు, వడ్డీ కింద రూ. 16,430 కోట్లు, జరిమానా కింద మరో రూ. 7,900 కోట్లు కట్టాలంటూ సూచించింది. అనుబంధ సంస్థ హచిసన్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంటర్నేషనల్‌ (హెచ్‌టీఐఎల్‌)కి ఈ మేరకు నోటీసులు వచ్చినట్లు బిలియనీర్‌ లీ కాషింగ్‌కి చెందిన సీకే హచిసన్‌ హోల్డింగ్స్‌ హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది.

విప్రో బైబ్యాక్‌కు షేర్‌ హోల్డర్ల అనుమతి
దేశంలో మూడో పెద్ద ఐటీ కంపెనీ విప్రో ప్రతిపాదించిన రూ. 11,000 కోట్ల బైబ్యాక్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి లభించింది. షేరుకు రూ. 320 ధరతో 34.37 కోట్ల షేర్ల కొనుగోలుకు గత నెలలో విప్రో బైబ్యాక్‌ ప్రతిపాదనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు మెజారిటీ షేర్‌హోల్డర్లకు పోస్టల్‌ బ్యాలెట్, ఈ–ఓటింగ్‌ ద్వారా ఆమోదం తెలిపినట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.  

పెద్ద కార్లపై సెస్సుకు గ్రీన్‌ సిగ్నల్‌
పెద్ద కార్లపై సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి గరిష్టంగా 25 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో మధ్య, పెద్ద కార్లు, లగ్జరీ వాహనాలు, హైబ్రీడ్‌ వాహనాలు, స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ మొదలైన వాటి రేట్లు పెరగనున్నాయి. సెస్సు రేటును పెంచేందుకు జీఎస్‌టీ చట్టానికి ఆర్డినెన్స్‌ ద్వారా తగు సవరణలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.

డిసెంబర్‌ 31 వరకు ఆధార్‌–పాన్‌ అనుసంధానం
కేంద్ర ప్రభుత్వం ఆధార్‌–పాన్‌ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్‌ 31 వరకు ఆధార్, పాన్‌ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సెప్టెంబర్‌ 30 వరకు రిటర్న్స్‌ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు, ఆడిట్‌ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్‌ 31 వరకు సమయమిచ్చినట్లు పేర్కొంది.

నోట్ల రద్దు.. ఓ ఫ్లాప్‌ షో!!
నల్లధన నియంత్రనే లక్ష్యంగా ప్రధాని మోదీ అనూహ్యంగా ప్రకటించిన డీమోనిటైజేషన్‌ పెద్ద ఫ్లాప్‌ షోగా మిగిలింది. పెద్ద నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లలో రద్దు తర్వాత దాదాపు 99 శాతం వెనక్కి వచ్చేశాయి. మొత్తంగా రూ.15.44 లక్షల కోట్ల విలువైన నోట్లు రద్దు కాగా.. అందులో రూ.15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. కేవలం రూ.16,050 కోట్లు మాత్రమే డిపాజిట్‌ కాలేదు.

వృద్ధి చక్రాలు వెనక్కి..!
2017–18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ వృద్ధి కేవలం 5.7 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి–మార్చి మధ్య 4.6 శాతం కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తర్వాత అత్యంత తక్కువ ఇదే. గతేడాది ఇదే కాలంలో నమోదైన వృద్ధి రేటు ఏకంగా 7.9 శాతం కావటం గమనార్హం. గతేడాది 4వ త్రైమాసికంలోనూ 6.1 శాతం నమోదయ్యింది.

డీల్స్‌..
దేశీ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ ’భారతీ ఎయిర్‌టెల్‌’.. సెమాంటెక్‌ కార్పొరేషన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లోని కంపెనీలకు సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అందించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

అల్జీరియా సంస్థ సెవిటాల్‌ గ్రూప్‌కు చెందిన అఫెర్పీ స్టీల్‌ మిల్లును కొనుగోలు చేయాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ యోచిస్తోంది. ఇందుకోసం సుమారు 100 మిలియన్‌ డాలర్లు ఆఫర్‌ చేసినట్లు, సెవిటాల్‌ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

æ సోలార్, విండ్‌పవర్‌ వ్యాపారంలో నిమగ్నమైన తమ గ్రూప్‌ కంపెనీ సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఎనర్జీ (ఎస్‌జీఐ)లో మిగిలిన వాటాను ఐడీఎఫ్‌సీ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ నుంచి రూ. 1,410 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

æ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ దిశగా స్వీడన్‌కి చెందిన దిగ్గజ సంస్థ శాబ్‌తో అదానీ గ్రూప్‌ చేతులు కలిపింది. భారతీయ వైమానిక దళాలకు కావాల్సిన సింగిల్‌ ఇంజిన్‌ ఫైటర్‌ జెట్స్‌ కాంట్రాక్టు దక్కించుకోవడం లక్ష్యంగా ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

నియామకాలు
నీతి ఆయోగ్‌ కొత్త వైస్‌చైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టారు.

ప్రపంచపు అతిపెద్ద కోల్‌ మైనింగ్‌ కంపెనీ ’కోల్‌ ఇండియా’కు సీఎండీ నియామకం జరిగింది. సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (సీసీఎల్‌) చీఫ్‌ గోపాల్‌ సింగ్‌.. కోల్‌ ఇండి యా తాత్కాలిక సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ కాపర్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సంతోష్‌ శర్మ బాధ్యతలు స్వీకరించారు.

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) సెక్రటరీ జనరల్‌గా సంజయ బారు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇదివరకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (2004–08)కి మీడియా అడ్వైజర్‌గా వ్యవహరించారు.

>
మరిన్ని వార్తలు